Environmental permits
-
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్‌తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్‌లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
‘క్రిస్ సిటీ’ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఫ్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ పారిశ్రామిక నగర నిర్మాణంలో కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా, వ్యర్థాలను శుద్ధి చేయాలని, భూగర్భ జలాలను, సహజ సిద్ధంగా ఉన్న కాలువలు, చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశ ప్రాజెక్టుకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం కూడా లభించింది. చదవండి: AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ.. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోభాగంగా కృష్ణపట్నం వద్ద మొత్తం 11,095.9 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిక్‌డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ నిక్‌డిట్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. టెక్స్టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2,96,140 మందికి ప్రత్యక్షంగా, 1,71,600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. తొలిదశలో 2,006.09 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. తొలి దశకు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశ నిర్మాణానికి జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి కూడా ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. సుమారు రూ.1,054.63 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తారు. క్రిస్ సిటీ నిర్మాణ సమయంలో రోజుకు 500 కిలో లీటర్లు, ప్రాజెక్టు పూర్తయ్యాక పరిశ్రమలకు రోజుకు 99.7 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ నీటిని 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు రిజర్వాయర్ నుంచి సరఫరా చేయనున్నారు. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 24, 25 తేదీల్లో సమావేశమైన ఈఏసీ నిమ్జ్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించింది. పర్యావరణ అనుమతుల జారీలో పలు షరతులు విధిస్తూ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈఏసీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ త్వరలో కేంద్ర పర్యావరణ శాఖ త్వరలో నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీచేస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడం, పారిశ్రామిక వాడలు జనావాసాలకు నడుమ 500–700 మీటర్ల దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలని ఈఏసీ సూచించింది. నిమ్జ్ సరిహద్దు వెంట గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలు, కాలుష్య జలాల శుద్దీకరణ, ప్రాజెక్టు విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌బెల్ట్ వంటి నిబంధనలు పాటించాలని పేర్కొంది. ముంగి, చీలపల్లి తండాలను ప్రాజెక్టు పరిధి నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది. భూ సేకరణే అసలు సవాలు... రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, న్యాలకల్ మండలాల్లోని 17 గ్రామాల్లో భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 2016లో ఈ పారిశ్రామిక వాడకు కేంద్రం నిమ్జ్ హోదా కల్పించింది. నిమ్జ్ ఏర్పాటుకు 12,635 ఎకరాలు అవసరం కాగా, భూ సేకరణకు రూ.2450 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తొలి విడతలో 3,501 ఎకరాలను సేకరిం చాల్సి ఉండగా, 2,925 ఎకరాల సేకరణ పూర్తయింది. మరో రెండు విడతల్లో 9వేల ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉండగా, రెండో విడత భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం భూ ముల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు సరిపోదని ఆందోళనకు దిగుతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇదిలాఉంటే 2022–23 బడ్జెట్లో నిమ్జ్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. మౌలిక వసతులకు నిధులేవీ? నిమ్జ్‌కు తొలి విడతలో సేకరించిన భూమిని మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మౌలిక వసతుల కల్పనకు రూ.13వేల కోట్లు అవసరమని అంచనా వేయగా, తొలిదశలో కనీసం రూ.2వేల కోట్లు ఇవ్వాలని పరిశ్రమల మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. అయితే కేంద్రం కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది. నిమ్జ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలు ఎలక్ట్రికల్ మెషినరీ, మెటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ పెట్టుబడులు అంచనా: రూ.60వేల కోట్లు ఉద్యోగ అవకాశాలు: 2.77 లక్షలు -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
కోశలనగరం పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద ఏపీఐఐసీ ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు లభించాయి. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనుంది. ఇందులో 1,371.52 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, మిగిలిన స్థలాన్ని మౌలికవసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పారిశ్రామిక పార్కుకు కీలకమైన పర్యావరణ అనుమతులు రావడంతో మౌలికవసతుల అభివృద్ధి కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. -
‘రాయలసీమ’కు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ)కి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమ ప్రాజెక్టని, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నీటి కేటాయింపులు లేవని, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవని దృష్టికి తెచ్చింది. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేసింది. సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులు జరుపలేదన్న కారణంగానే తెలంగాణ చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం (ఫేజ్–1)కు సైతం 2018 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతులు వాయిదా వేసిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ ఈఏసీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు ఇవ్వకూడదో లేఖలో వివరించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని, ఇది కేంద్ర జల సంఘం ఆమోదించని అక్రమ ప్రాజెక్టని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా కృష్ణా జలాలను బేసిన్ అవతలకు తరలించేలా ప్రయత్నాలు చేస్తోందని, దీనిద్వారా ఏపీ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని తెలిపింది. ముఖ్యంగా వన్యప్రాణి కేంద్రాలైన రొలియాపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంకమల్లేశ్వర, శ్రీ పెనుసిల నర్సింహ, రాజీవ్‌గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర పార్కులు ఈ ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. వాటి వివరాలను జత చేశారు. ప్రతిపాదిత అలైన్మెంట్ కేవలం బఫర్ జోన్‌లోంచే కాకుండా కోర్ జోన్ల ద్వారా వెళుతున్నట్లు ఏపీ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని తెలిపారు. దీంతోపాటే జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించి, అనుమతులు పొందేవరకు ముందుకు వెళ్లరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని దృష్టికి తెచ్చారు. వీటితో పాటే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిందని, తదనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేంతవరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని లేఖలో తెలిపారు. ఈ అంశాల దృష్ట్యా పర్యావరణ అనుమతుల మంజూరుకు ముందు న్యాయపరమైన, పర్యావరణ, హైడ్రాలాజికల్ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈఎన్సీని కోరారు. -
సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో దశాబ్దాలుగా ఉన్న చెట్లకు ఎలాంటి నష్టం కలిగించబోమని, కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి అడ్డుగా ఉన్న 27 వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రాతిపదికన ఈ అనుమతి ఇచ్చింది. పాత సెక్రటేరియట్ ఆవరణలో మొత్తం 607 చెట్లు ఉన్నాయని, వాటిలో ఒక్క చెట్టునూ తొలగించట్లేదని ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మొత్తం వృక్షాల్లో అంతరించిపోయే రకానికి చెందినవేవీ లేవని అందులో వివరించింది. కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో (పాత సెక్రటేరియట్ ప్రాంగణంలో) మర్రి, రావి, చింత, వేప, అశోక, కానుగ,తదితర వృక్ష రకాలు గుల్మొహర్, పొగడ, బాదం, అల్లనేరేడు వంటి చెట్లు ఉన్నాయి. -
అవినీతి తిమింగలం.. కట్టలు కట్టలుగా నగదు, బంగారం
సాక్షి, చెన్నై: పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం పుచ్చుకుంటున్న ఓ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు తమ వలలో వేసుకున్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేసింది. చెన్నై, సైదాపేట పనగల్ మాలిగైలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ విభాగం కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పాండియన్ పనిచేస్తున్నారు. అనుమతుల కోసం వచ్చే సంస్థలు, పరిశ్రమలు ఈయన గారి చేతులు తడపాల్సిందే. లక్షల్లో లంచం పుచ్చుకునే ఈ అధికారి గుట్టును రట్టు చేస్తూ ఓ సంస్థ ఏసీబీకి రహస్యంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఏసీబీ ఏడీఎస్పీ లావణ్య నేతృత్వంలోని బృందం పాండియన్‌పై కన్నేసింది. చదవండి: (సోదరిపై ప్రేమ: అతడు చేసిన పని హాట్‌టాపిక్..) ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పాండియన్ గదిలోకి ప్రవేశించిన ఈ బృందం సోదాల్లో నిమగ్నమైంది. మరో బృందం శాలిగ్రామంలోని పాండియన్ ఇంట్లో సోదాలు చేపట్టింది. రాత్రంతా ఈ సోదాలు సాగాయి. రెండో రోజు మంగళవారం కూడా తనిఖీలు సాగాయి. పాండియన్ కార్యాలయ గదిలో లక్షల కొద్ది నగదు, ఇంట్లో కట్టలు కట్టలుగా 1.5 కోట్ల నగదు బయటపడింది. రూ.7 కోట్లు విలువ చేసే 18 ఆస్తుల దస్తావేజులు చిక్కాయి. బీరువాల్లో 3 కేజీల బంగారు ఆభరణాలు, రూ. ఐదున్నర లక్షల విలువ చేసే వజ్రహారం, ఒకటిన్నర కేజీ వెండి వస్తువులు ఈ సోదాల్లో బయట పడ్డాయి. ఈ ఆస్తులు ఎలా గడించారో అన్న విషయంగా పాండియన్ వద్ద ఏసీబీ విచారణ సాగుతోంది. చదవండి: (నైట్ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది) ఈరోడ్‌లో.. ఈరోడ్‌లో శ్రీపతి అసోసియేట్స్‌పై ఐటీ దాడులు సాగాయి. ఈ సంస్థ ప్రభుత్వ భవనాల నిర్మాణాలతోపాటు పలు, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు చేపట్టింది. పన్ను ఎగవేత సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి ఈసంస్థ కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.16 కోట్లు విలువ చేసే నగదు, ఆస్తుల దస్తావేజులు బయట పడ్డట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఐటీ వర్గాలు సాగించిన దాడుల్లో రూ. 23 కోట్ల నగదు, రూ. 110 కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని సీజ్ చేసినట్టు ఆ కార్యాలయం ఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: (చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్) -
పర్యావరణ అనుమతులు సడలించండి
• పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులకు రూ.7,900 కోట్ల రుణం ఇప్పించండి • నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి కోరనున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతుల నిబంధనలను సడలించడంతోపాటు ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద 11 పెండింగ్ ప్రాజెక్టులకు రూ. 7,900 కోట్ల రుణం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరనున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అనీల్ మాధవ్ దవే, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీలో ఏళ్ల తరబడి జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయ అంచనాలు భారీగా పెరిగి ఖజానాపై భారం పడుతోందన్న అంశాన్ని దవే దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ దృష్ట్యా పర్యావరణ అనుమతుల నిబంధనలను సరళతరం చేయాలని కోరను న్నారు. దీంతోపాటే ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య వంటి అంశాలపై ఉమాభారతి అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థారుు సమావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం మరోసారి ఒత్తిడి తేనున్నారు. పీఎంకేఎస్‌వై కింద గుర్తించిన 11 ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకోవాలన్న నిర్ణయం గురించి ఉమాభారతికి వివరించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులకు ఎఫ్ఆర్బీఎంతో నిమిత్తం లేకుండా రూ.7,900 కోట్ల రుణాలు ఇప్పించాలని విన్నవించనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసేందుకు దీర్ఘకాలిక సాగునీటి నిధి కింద నిధుల విడుదలకు విన్నవించే అవకాశం ఉంది. -
పర్యావరణ అనుమతుల్లేకుండా పనులా?
♦ అవి లేకుండా మేమెలా పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తాం? ♦ భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులపై హైకోర్టు ప్రశ్నలు ♦ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా, మణుగూరులో 1,180 ఎకరాల్లో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేం దుకు హైకోర్టు నిరాకరించింది. పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా ఎలా పనులు చేస్తారని జెన్కోను ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేనప్పుడు పనుల కొనసాగింపునకు తామైనా ఎలా ఆదేశాలు ఇస్తామని ప్రశ్నిం చింది. అనుమతులు తెచ్చుకుని ఏ పనులైనా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే కోసం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి పలు రకాలుగా అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఎన్జీటీలో ఫిర్యాదు చేసిన మానవ హక్కుల ఫోరం ప్రధా న కార్యదర్శి కన్నెబోయిన వెంకట నరసయ్యకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాత చేపడతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేయాలంటూ ఎన్జీటీ గత నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలం టూ తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో చైర్మన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, తమకు నోటీసులు జారీ చేయకుండా ఎన్జీటీ తమ పరోక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని, ప్రస్తుతం పునాది పనులే జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల వల్ల పర్యావరణానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులెలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. దీనికి రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ తన వాదనను మళ్లీ వినిపించారు. పునాది నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, ఆ మేరకు హామీ కూడా ఇస్తున్నామన్నారు. దీనికి ధర్మాసనం పర్యావరణ అనుమతులు అవసరమని నిబంధనలు చెబుతున్నప్పుడు, ఆ అనుమతులు లేకుండా ఏ స్థాయి పనులు కూడా ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అనుమతులు తీసుకుని వాటిని చేసుకోవచ్చునని, నిబంధనలకు విరుద్ధంగా తాము ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని సంక్రాంతి సెలవుల పూర్తయిన వెంటనే విచారిస్తామని, అప్పటి వరకు వచ్చిన నష్టం ఏమీ ఉండబోదని తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
మూడేళ్లలో ‘లోయర్ వార్దా’ పూర్తి
♦ వెల్లడించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ♦ {పాజెక్టు వల్ల 66,000 హెక్టార్లకు నీరందుతుందని స్పష్టం ముంబై : లోయర్ వార్దా ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రాంతమైన విదర్భలోని వార్దా జిల్లాలో సుమారు 66,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం పర్యటించారు. జిల్లాలోని అర్వి తెహసీల్ ధనోడి (బమదర్పూర్) వద్ద పనులను పర్యవేక్షించారు. లోయర్ వార్ధా ప్రాజెక్టు పరిధిలోని గిరోలి కెనాల్, డియోరీ బ్రాంచ్ కెనాల్, పుల్గావ్ బ్యారేజ్, ఖర్దా బ్యారేజ్, ఆన్జి-అందోరీ బ్యారేజ్, అర్వి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాలు ప్రభావితమవుతుండటంతో ప్రాజెక్టు వల్ల వ్యవసాయ భూములు నాశనమవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు చెప్పారు. పునరావాసంపై సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టువల్ల నిరాశ్రయులవుతున్న ప్రజలకు ఇచ్చే మౌళిక వసతులను పెంచుతామని వెల్లడించారు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో కనీస సౌకర్యాల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ గ్రామాల్లో వసతుల ఏర్పాటు, నిర్వహణ ఖర్చును ఐదు నుంచి ఇరవైఐదు శాతానికి పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. కార్యక్రమంలో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పోటే, వార్దా ఎంపీ రాందాస్ తదాస్, శాసన సభ్యులు అమర్ కలే, పంకజ్ భోయర్, సమీర్ కునవర్, వీరేంద్ర జగ్తాప్, మాజీ ఎంసీ విజయ్ ముడే పాల్గొన్నారు. కరువు పరిస్థితిపై సమీక్ష సమావేశం మరాఠ్వాడాలోని కరవు పరిస్థితిపై సోమవారం ఔరంగాబాద్‌లో సీఎం ఫడ్నవీస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం మరాఠ్వాడాలోని డ్యాంలలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే నీరుందని, హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా పశుగ్రాసం, రైలు బోగీల ద్వరా నీరు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. డ్యాంలలో కనీస పరిమాణం నీరుండేలా ఎగువ రిజర్వాయర్ల నుంచి నీటిని కిందికి వదులుతామన్నారు. కరవు పరిస్థితుల్ని తట్టుకునేందుకు ప్రభుత్వం మొదలు పెట్టిన 27 రకాల చర్యలను గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తామని, వ్యవసాయ చెరువులు, బావుల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటివరకు 500 ఎంఎం వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతంలో ఇది 59.3 శాతమని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,229 రిజర్వాయర్లలో 18,018 టీఎంసీల నీరుందని, రిజర్వాయర్ల సామర్థ్యంలో ఇది 48 శాతమని కార్యాలయం పేర్కొంది. 2013లో రిజర్వాయర్లలో నీటి పరిమాణం 76 శాతం, గతేడాది 61 శాతముందని ప్రకటించింది. సమీక్ష సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఏక్నాథ్ ఖడ్సే, పంకజ ముండే, దివాకర్ రావుతే, దీపక్ సావంత్, బాబన్‌రావ్ లోనికర్, దిలిప్ కామ్లే ఇతర మంత్రులు పాల్గొన్నారు.