మూడేళ్లలో ‘లోయర్ వార్దా’ పూర్తి
♦ వెల్లడించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్
♦ {పాజెక్టు వల్ల 66,000 హెక్టార్లకు నీరందుతుందని స్పష్టం
ముంబై : లోయర్ వార్దా ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రాంతమైన విదర్భలోని వార్దా జిల్లాలో సుమారు 66,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందుతుందని ఆయన చెప్పారు. ఆదివారం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం పర్యటించారు. జిల్లాలోని అర్వి తెహసీల్ ధనోడి (బమదర్‌పూర్) వద్ద పనులను పర్యవేక్షించారు. లోయర్ వార్ధా ప్రాజెక్టు పరిధిలోని గిరోలి కెనాల్, డియోరీ బ్రాంచ్ కెనాల్, పుల్గావ్ బ్యారేజ్, ఖర్దా బ్యారేజ్, ఆన్జి-అందోరీ బ్యారేజ్, అర్వి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాలు ప్రభావితమవుతుండటంతో ప్రాజెక్టు వల్ల వ్యవసాయ భూములు నాశనమవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు చెప్పారు. పునరావాసంపై సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టువల్ల నిరాశ్రయులవుతున్న ప్రజలకు ఇచ్చే మౌళిక వసతులను పెంచుతామని వెల్లడించారు. పునరావాసం కల్పించిన గ్రామాల్లో కనీస సౌకర్యాల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ గ్రామాల్లో వసతుల ఏర్పాటు, నిర్వహణ ఖర్చును ఐదు నుంచి ఇరవైఐదు శాతానికి పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. కార్యక్రమంలో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పోటే, వార్దా ఎంపీ రాందాస్ తదాస్, శాసన సభ్యులు అమర్ కలే, పంకజ్ భోయర్, సమీర్ కునవర్, వీరేంద్ర జగ్‌తాప్, మాజీ ఎంసీ విజయ్ ముడే పాల్గొన్నారు.
కరువు పరిస్థితిపై సమీక్ష సమావేశం
మరాఠ్వాడాలోని కరవు పరిస్థితిపై సోమవారం ఔరంగాబాద్‌లో సీఎం ఫడ్నవీస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం మరాఠ్వాడాలోని డ్యాంలలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే నీరుందని, హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా పశుగ్రాసం, రైలు బోగీల ద్వరా నీరు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. డ్యాంలలో కనీస పరిమాణం నీరుండేలా ఎగువ రిజర్వాయర్ల నుంచి నీటిని కిందికి వదులుతామన్నారు.
కరవు పరిస్థితుల్ని తట్టుకునేందుకు ప్రభుత్వం మొదలు పెట్టిన 27 రకాల చర్యలను గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తామని, వ్యవసాయ చెరువులు, బావుల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటివరకు 500 ఎంఎం వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతంలో ఇది 59.3 శాతమని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,229 రిజర్వాయర్లలో 18,018 టీఎంసీల నీరుందని, రిజర్వాయర్ల సామర్థ్యంలో ఇది 48 శాతమని కార్యాలయం పేర్కొంది.
2013లో రిజర్వాయర్లలో నీటి పరిమాణం 76 శాతం, గతేడాది 61 శాతముందని ప్రకటించింది. సమీక్ష సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, దివాకర్ రావుతే, దీపక్ సావంత్, బాబన్‌రావ్ లోనికర్, దిలిప్ కామ్లే ఇతర మంత్రులు పాల్గొన్నారు.