తాజాగా పర్యావరణ అనుమతుల జారీకి నిపుణుల కమిటీ సిఫారసు
2017 జూలైలోనే పర్యావరణ అనుమతులు జారీ
అనుమతులకు విరుద్ధమైన టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం నిర్మాణం
దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యావరణ అనుమతులు పొందాలని 2022లో ఎన్జీటీ ఆదేశాలు
ఏడాదిన్నర తర్వాత ఫలించిన సుదీర్ఘ ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్‌కో ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను జెన్‌కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.
మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్‌లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్‌కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్‌కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది.
కృష్ణానదిని కలుషితం చేయమని హామీ
కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్‌కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.
తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్‌కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.
పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్‌తో పాటు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్‌కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది.
నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని....
♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి.
♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి.
♦బూడిద కోసం భవిష్యత్‌లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్‌లోనే తరలించాలి.
♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి.
♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపు
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్‌కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది..
యూనిట్ గడువు
యూనిట్– 1 15.10.2024
యూనిట్–2 15.10.2024
యూనిట్ –3 31.03.2025
యూనిట్–4 31.12.2024
యూనిట్–5 28.02.2025
Comments
Please login to add a commentAdd a comment