‘యాదాద్రి విద్యుత్’కు కేంద్రం ఆమోదం!
ప్రాజెక్టు సూచన నిబంధనలను
ఆమోదించిన పర్యావరణ శాఖ
పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమం
ఆ తర్వాతే ప్రారంభం కానున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు
2018లోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమమైంది. 4000(5ఁ800) మెగావాట్ల భారీ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ జెన్‌కో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన సూచన నిబంధనలను(టర్మ్ ఆఫ్ రిఫరెన్స్-టీవోఆర్)ను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్ రావు నేతృత్వంలో డెరైక్టర్(ప్రాజెక్టులు) రాధాకృష్ణ, చీఫ్ ఇంజనీర్ అజయ్ బృందం ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర పర్యావరణ శాఖ విధించే షరతులకు లోబడి ప్రాజెక్టు నిర్మాణాన్ని జరుపుతామని అంగీకరించడంతో టీఓఆర్‌ను ఆమోదించాలని నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి గతంలో జరిగిన రెండు సమావేశాల్లో ఈ ప్రాజెక్టు టీవోఆర్‌ను ఆమోదించేందుకు పర్యావరణ నిపుణుల కమిటీ అంగీకరించలేదు. వాస్తవానికి గత అక్టోబర్ 29న జరిగిన సమావేశంలో ఏకంగా ఈ ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించాలని లేక ప్రాజెక్టు డిజైన్‌నే మార్చే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ జెన్‌కో యాజమాన్యానికి సూచిం చింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం మధ్యలో నుంచి కృష్ణా నదిలోకి ప్రవహిస్తున్న ‘అన్నమేరు వాగు’ వెళ్తుండడమే ఇందుకు కారణం.
అయితే, దీనిపై నిపుణుల కమిటీ.. ఓ ఉప కమిటీని క్షేత్ర స్థాయి పర్యటనకు పంపించింది. ఈ ఉప కమిటీ క్షేత్ర స్థాయి పర్యటన జరిపి ప్రాజెక్టు నిర్మించేందుకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల అన్నమేరు వాగు కలుషితం కాకుండా సంరక్షించేందుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు ఇతర సాంకేతిక షరతులను విధిం చింది.
ఈ షరతులను జెన్‌కో యాజమాన్యం అంగీకరించినా కూడా గత డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని నిపుణుల కమిటీ ఆమోదించకుండా నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎట్టకేలకు శుక్రవారం జరిగిన మూడో సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ టీవోఆర్‌ను ఆమోదించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులను కోరుతూ త్వరలో జెన్‌కో యాజమాన్యం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోనుంది. ఇదే నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల జారీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2018 ముగిసేలోగా దామరచర్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.