మార్చి నుంచి నైనీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నైనీ బ్లాక్ దగ్గర ఏర్పాటుకు స్థలం కేటాయించండి... ఒడిశా సీఎం మోహన్ చరణ్‌ను కోరిన భట్టి
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీకి ఆయన విజ్ఞాపన లేఖను అందజేశారు. నైనీ బ్లాకు ఏర్పాటుకు ఒడిశా సీఎం కార్యాలయం మద్దతు ఇచి్చనందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నైనీ గనికి సమీపంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం స్థాపనకు భూమిని కేటాయించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరగా, ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
‘గత జూలై 24న మీతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చర్చలు ఫలవంతమయ్యాయి’అని భట్టి సంతోషం వ్యక్తం చేశారు. నైనీ గనిలో ఉత్పత్తయిన బొగ్గును 1000 కి.మీ. దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు పెరిగి విద్యుత్ ధరలూ భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నైనీ గనికి సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తయ్యే బొగ్గును అక్కడే వినియోగించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ప్రకారం వచ్చే మూడు దశాబ్దాలపాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుందన్నారు. బొగ్గు గనుల దగ్గరే కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో బొగ్గు రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. సింగరేణి, ఒడిశా అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమికంగా జరపాడ/తుకుడ, హండప్ప/బని నాలిని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయానికి వచ్చారన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
10 ప్రాజెక్టులకు నిధులిప్పించండి
తెలంగాణ చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయంతోపాటు అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పది ప్రాజెక్టులకు మొత్తం రూ.1,63,559 కోట్ల వ్యయం కానుందని తెలిపా రు. మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతుల ప్రతిపాదనల తో కూడిన వినతిపత్రాన్ని కిషన్‌రెడ్డికి అందజేశారు.
32 ఖనిజ బ్లాకులను వేలం వేస్తాం
సున్నపురాయి, మాంగనీసు వంటి 32 మేజర్ ఖనిజ బ్లాకులను 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి వేలం వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014లో రూ.1958 కోట్లుగా ఉన్న ఖనిజ ఆదాయం 2023–24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగిందన్నారు. జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో భట్టి ప్రసంగించారు. ‘జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఖనిజాన్వేషణ, నిర్వహణ ఉండాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో మొత్తం 2,552 గనుల లీజుల ఉన్నాయని, చిన్న ఖనిజాల లీజు మంజూరు విషయంలో బ్లాక్‌ల వేలం విధానంలో అనుసరించే నిబంధనలు పాటిస్తున్నాం’అని భట్టి వెల్లడించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ద్వారా 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలైందని, ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment