పర్యావరణ అనుమతుల్లేకుండా పనులా?
♦ అవి లేకుండా మేమెలా పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తాం?
♦ భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులపై హైకోర్టు ప్రశ్నలు
♦ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా, మణుగూరులో 1,180 ఎకరాల్లో తెలంగాణ జెన్‌కో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేం దుకు హైకోర్టు నిరాకరించింది. పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా ఎలా పనులు చేస్తారని జెన్‌కోను ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేనప్పుడు పనుల కొనసాగింపునకు తామైనా ఎలా ఆదేశాలు ఇస్తామని ప్రశ్నిం చింది. అనుమతులు తెచ్చుకుని ఏ పనులైనా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే కోసం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి పలు రకాలుగా అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్‌జీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఎన్‌జీటీలో ఫిర్యాదు చేసిన మానవ హక్కుల ఫోరం ప్రధా న కార్యదర్శి కన్నెబోయిన వెంకట నరసయ్యకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాత చేపడతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను నిలిపేయాలంటూ ఎన్‌జీటీ గత నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలం టూ తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, జెన్‌కో చైర్మన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, తమకు నోటీసులు జారీ చేయకుండా ఎన్‌జీటీ తమ పరోక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని, ప్రస్తుతం పునాది పనులే జరుగుతున్నాయని తెలిపారు.
ఈ పనుల వల్ల పర్యావరణానికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులెలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. దీనికి రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ తన వాదనను మళ్లీ వినిపించారు. పునాది నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, ఆ మేరకు హామీ కూడా ఇస్తున్నామన్నారు. దీనికి ధర్మాసనం పర్యావరణ అనుమతులు అవసరమని నిబంధనలు చెబుతున్నప్పుడు, ఆ అనుమతులు లేకుండా ఏ స్థాయి పనులు కూడా ప్రారంభించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
అనుమతులు తీసుకుని వాటిని చేసుకోవచ్చునని, నిబంధనలకు విరుద్ధంగా తాము ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని సంక్రాంతి సెలవుల పూర్తయిన వెంటనే విచారిస్తామని, అప్పటి వరకు వచ్చిన నష్టం ఏమీ ఉండబోదని తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.