సాక్షి, చెన్నై : వాహన కాలుష్య నియంత్రణపై పరిశీలనకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ ఆటోల అనుమతులకు కల్లెం వేస్తూ ఈ ఆదేశాలు జారీ కావడంతో ఆటోవాలాల్లో కలవరం బయలు దేరింది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతున్నాయి. మోటారు సైకిళ్లు, నాలుగు చక్రాల వాహనాలతో పాటుగా ఆటోల సంఖ్య కూడా ఈ పెరుగుదల్లో ఉన్నాయి. వీటిలో నుంచి వెలువడే పొగతో కాలుష్యం కోరలు చాచింది. ఈ పరిస్థితుల్లో నామక్కల్‌కు చెందిన పి భూపాలన్ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే రీతిలో ఇక, పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోలకు అనుమతులు ఇవ్వకూడదని, గ్యాస్‌తో నడిచే ఆటోల మీద దృష్టి పెట్టాలంటూ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఉత్తర్వులు జారీ చేసినట్టు అందులో వివరించారు. ప్రధానంగా చెన్నైలో పెరుగుతున్న కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా ఈ ఉత్తర్వులు జారీ చేయబడినట్టుందని గుర్తు చేశారు. అదే సమయంలో ఈరోడ్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని గుర్తు చేస్తూ తాను సమర్పించిన వినతి పత్రానికి స్పందన వచ్చిందని, అయితే, ఆ ఉత్తర్వులు ఇంత వరకు అమలు కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
వాహన కాలుష్య పెరిగి ఉన్నదని, ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోల సంఖ్య పెరగడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారి ఉన్నదన్న విషయాన్ని పరిగణించాలని కోర్టుకు సూచించారు. కాలుష్య కోరల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు,పట్టణాలు చిక్కి ఉన్నాయని,దీనిని పరిగణలోకి తీసుకుని ఆ ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి పుష్పా సత్యనారాయణన్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ, పెట్రోల్ , డీజిల్‌లతో నడిచే ఆటోలను ఎందుకు నిషేధించ కూడదూ..? అన్న ప్రశ్నను బెంచ్ తెర మీదకు తెచ్చింది. అనుమతుల వ్యవహారంలో ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.
ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి తరపున ప్రభుత్వ న్యాయవాది కమలనాథన్ జోక్యం చేసుకుని, ఆ ఉత్తర్వుల అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు. అయితే, త్వరితగతిన పరిశీలన పూర్తి చేయాలని, ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచిస్తూ, నాలుగు వారాల గడువును ప్రభుత్వానికి బెంచ్ కేటాయించింది. పెట్రోల్, డీజిల్ ఆటోల నిషేధం వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోనున్న చర్యలతో కూడిన నివేదికను మార్చి 24వ తేదిన కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. కాగా, మీటర్లను పక్కన పెట్టి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి మరీ చార్జీలను దండుకుంటున్న ఆటో వాలాలకు తాజాగా కోర్టు జారీ చేసిన ఆదేశాలు షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ నిషేధం అమల్లోకి వస్తే, ఇక, పెట్రోల్, డీజిల్ ఆటోలు గ్యాస్‌కు మారాల్సిందే. ఇది సాధ్యం అయ్యేనా, అదే సమయంలో ఆయా వాహన ఉత్పత్తి సంస్థలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయోనన్నది వేచి చూడాల్సిందే.
పరిశీలించండి!
Published Fri, Jan 22 2016 2:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement