క్రషర్ మిషన్ దుమ్ముతో దెబ‍్బతిన్న పంట
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): జేఆర్‌సీ కేసీవీఆర్ క్రస్సర్ మిషన్ ఏర్పాటుపై స్థానిక కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విచారణ ఏకపక్షంగా సాగింది. బనగానపల్లె మండలం భానుముక్కల సమీపంలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భార్య బీసీ ఇందిర ఈ మిషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పంటలు దెబ్బతిని నష్టం వస్తుండడంతో ఐదుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరు రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బృందం హైకోర్టుకు వెళ్లిన రైతులు గడ్డం వెంగళరెడ్డి, గడ్డం నాగేశ్వరి, వడ్డే రామాంజనమ్మ, వడ్డే శివమ్మ, వడ్డే చిన్న ఈశ్వరయ్యలతో సమావేశమయ్యారు. క్రస్సర్ మిషన్ అన్ని నిబంధలను పాటిస్తున్నట్లు చెప్పారు. రైతులు తమ పొలాలపై కూరుకున్న దుమ్ము, ధూళి ఫొటోలు, వీడియోలను అధికారులకు చూపించగా అవి పాతవని కొట్టిపారేశారు. వ్యవసాయాధికారులతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు తమకు న్యాయం జరగదని వెళ్లిపోయారు.
పొలాలను అమ్మేసుకుంటే మంచిది...
సమావేశంలో పాల్గొన్న అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గారు. పంట పొలాలను అమ్ముకుంటే మంచిదని రైతులకు సలహా ఇచ్చినట్లు అన్నదాతలు పేర్కొన్నారు. స్వయంగా అధికారులే ఇలా చెప్పుతుండడంతో తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. అయితే తామేమి అలాంటి ప్రతిపాదన చేయలేదని జేసీఈఈ రాజేంద్ర రెడ్డి వివరణ ఇచ్చారు.
విచారణలో పాల్గొన్న ఎమ్మెల్యే తమ్ముడు..
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల విచారణలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తమ్ముడు బీసీ రామనాథ«రెడ్డి, ఆయన అనుచరులు పాల్గొన్నారు. వారి ఎదుటనే విచారణ చేయడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.