
ఢిల్లీలో కొత్త నిబంధన.. ఏప్రిల్ 1 నుంచి అమలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చిచెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకొనేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణ(Pollution control)పై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
కాలం చెల్లిన వాహనాల(old vehicles)కు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు.
ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజారవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్‌జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment