పీసీబీ నోటీసులు ఇవ్వకుండా సీజ్
హైకోర్టును ఆశ్రయించిన రసాయన కంపెనీలు, గోదాముల యజమానులు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం దూలపల్లి పరిధిలో రసాయన కంపెనీలు, గోదాములను సీజ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై ఆయా కంపెనీలు, గోదాముల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది. కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పీసీబీ నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగా వాటిని సీజ్ చేశారని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. తమ గోదాములను తెరిచేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈ సమయంలో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తరఫు న్యాయవాది ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. సీజ్ చేసిన రసాయన కంపెనీలు, గోదాములు తీవ్ర వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆ నివేదికలో స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో వీటిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.