‘నిమ్జ్’కు లైన్ క్లియర్
భూముల కొనుగోలు చేసుకోవచ్చన్న హైకోర్టు
రిజిస్ట్రేషన్లకూ ఓకే.. అంతా తుది తీర్పునకు లోబడే
తదుపరి ఉత్తర్వులదాకా ఎవరినీ ఖాళీ చేయించొద్దు
మాకిచ్చిన హామీలు అమలు చేసి నివేదిక ఇవ్వండి
నివేదికపై మేం సంతృప్తి చెందితేనే ఖాళీ ప్రక్రియ
ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూముల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో లైన్‌క్లియర్ అయింది. 123 జీవో కింద భూముల కొనుగోలుకు, రిజిస్ట్రేషన్లకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే కొనుగోళ్లన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ‘‘తదుపరి ఉత్తర్వుల దాకా భూ యజమానులను గానీ, ఇతరులను గానీ ఖాళీ చేయించరాదు. 2013 భూ సేకరణ చట్టం షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలన్నింటినీ బాధితులకు వర్తింపజేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేసి, సంబంధిత నివేదికను మా ముందుంచండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దాన్ని తాము పరిశీలించి, సంతృప్తి చెందాకే భూముల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సవరణ జీవో ఇదిగో...
గత విచారణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 190లో ధర్మాసనం కొన్నింటిపై స్పష్టత కోరిన నేపథ్యంలో దానికి సవరణలు చేస్తూ జీవో 191 జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వివరించారు. జీవో కాపీని ధర్మాసనం ముందుంచారు. ‘‘ఉమ్మడి కుటుంబమన్న పదంపై అభ్యంతరం నేపథ్యంలో దాన్ని తొలగించి కుటుంబం అన్న పదం చేర్చాం. ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.3 వేలు, ఇతరులకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని జీవో 190లో పేర్కొన్నగా, ఆ మొత్తాలను ధరల సూచీకి అనుగుణంగా చెల్లిస్తామని తాజాగా చేర్చాం’’ అని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కుటుంబమంటే వితంతువు, భార్య చనిపోయిన వ్యక్తి, విడిగా ఉంటున్న మేజర్లు కూడానని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి గుర్తు చేశారు. వితంతువు విడిగా ఉంటే రూ.1.5 లక్షలు చెల్లిస్తామని, ఉద్యోగాల్లో బాధితులకు ప్రాధాన్యమిస్తామని ధర్మాసనం ప్రశ్నలకు బదులుగా ఏజీ చెప్పారు. 2014 పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలిస్తామన్నారు. అలా జరగడం లేదని, మెదక్ జిల్లాలో విడ్‌మిల్ కంపెనీలో ఛత్తీస్‌గఢ్ వారికే అత్యధిక ఉద్యోగాలు దక్కాయని మూర్తి అన్నారు. రేపు నిమ్జ్ విషయంలోనూ ఇదే జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాజ్యం ప్రాథమిక దశలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి చర్చ సరికాదని ఏజీ అన్నారు.
ఉద్యోగం, కుటుంబం పదాల్లో 191 జీవోలో సందిగ్ధత ఉండటం నిజమేనన్న ధర్మాసనం, వీటిపై స్పష్టతనిచ్చేదాకా భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దంది. జీవో 123 ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు భూ కొనుగోళ్లపై దాఖలైన వ్యాజ్యాలపై ఇప్పటికిప్పుడు విచారణకు ధర్మాసనం నిరాకరించింది. వచ్చే వారం విచారిస్తామని, బాధితులెవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. పార్టీల పిటిషన్లను మాత్రం అనుమతించబోమంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడ్డందున ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలిస్తామంది.