
మెదక్‌లో ఎన్‌ఐఎంజెడ్
* ఏపీలోని చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం మంజూరు చేసిన 17 ఎన్‌ఐఎంజెడ్ (జాతీయ పెట్టుబడులు, మాన్యుఫాక్చరింగ్ జోన్)లను సూత్రప్రాయంగా ఆమోదించిందని, వీటిలో 9 ఎన్‌ఐఎంజెడ్‌లు ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ (డీఎంఐసీ) రీజియన్‌కు బయట ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
కేంద్రం మంజూరు చేసిన ఎన్‌ఐఎంజెడ్, పారిశ్రామిక కారిడార్లు, మెగా పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి అందిన ప్రతిపాదనల వివరాలను అందచేయాలని రాజ్యసభలో శుక్రవారం ఎంపీలు నంది ఎల్లయ్య, మురళీమోహన్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.
ఏపీలోని చిత్తూరు, ప్రకా శం, తెలంగాణలోని మెదక్, మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని తుమ్కూర్, కోలార్, బీదర్, గుల్బర్గా, ఒడిశాలోని కళింగనగర్‌లో ఎన్‌ఐఎంజెడ్‌లకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వివరించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నైలో విస్తరణ అయ్యేలా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, అమృత్‌సర్- కోల్‌కతా పారిశ్రామిక కారిడార్, బెంగళూరు-ముంబై ఆర్థిక కారిడార్‌ల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని తెలిపారు.