
మా పదేళ్ల పాలన తరువాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రమే
ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చేందుకే అప్పులు తెచ్చాం
తెచ్చిన అప్పు ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేశాం
పదేళ్లలో రూ.125 లక్షల కోట్ల అప్పు చేసింది బీజేపీ సర్కారే
ఆ అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ కౌంటర్
రాష్ట్ర అప్పులపై కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. అధికారం నుంచి దిగిపోయేనాడు కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పగించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల వరకు అప్పు ఉందని.. అప్పులను మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని అన్నారు.
పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఆదివారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు.
తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చాం
‘గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా వినియోగించి మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. సమైక్య రాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా నిలిపాం. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టు కాదు.
తెచ్చిన అప్పుతో తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించే ప్రాజెక్టులను నిర్మించాం. భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను ఉపయోగించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయలేదని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్లో, రైల్వే కేటాయింపుల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దితే, బహుమానంగా అవమానాలు మిగిలిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కేటాయించలేదని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇళ్లకు మంచినీళ్లిస్తే, దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు.
ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించాలని కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా దక్కిందేమీ లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment