
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి వలస వెళ్లిన సూరత్ వస్త్ర (పవర్‌లూమ్) పరిశ్రమల యజమానులు శనివారం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బాలమల్లును కలిశారు. వస్త్ర పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటుకు మహబూబాబాద్‌లో 200 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
తాము ఇక్కడ వీరభద్ర స్వామి టెక్స్‌టైల్ మాన్యుఫ్యాక్చ రర్స్ అండ్ వీవర్స్ వేల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎంసీపీసీడీఎస్ కింద టెక్స్‌టైల్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, స్పెషల్ ప్యాకేజీ మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టును బాలమల్లుకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.