- నిబంధనలకు నీళ్లు
- డిపాజిట్ చేయకముందే పనులు కట్టబెట్టేందుకు సన్నాహాలు
- జలమండలి అధికారుల నిర్వాకం
సాక్షి,సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. జలమండలి ఆధ్వర్యంలో మాదాపూర్ స్పోర్ట్స్ సిటీకి మంచి నీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) రూ.20 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది.
అయితే అంతకుముందేతమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేం దుకు జలమండలి అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.20 కోట్ల విలువైన పనులను సాధారణంగా జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. దీనికి భిన్నంగా ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలోనే చేపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి పనులు కట్టబెట్టేందుకే ఈ తతంగం ఆగమేఘాల మీద జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదీ కథ...
మాదాపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వెనుక వైపున నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీకి మంచినీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ముందుకొచ్చింది. దీనికి సైబర్ గేట్‌వే ప్రాంతంలోని విప్రో సంస్థ వె నుక వైపున 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (జీఎల్‌ఎస్‌ఆర్) నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్‌సిటీకి మంచినీటి సరఫరాకు 800 డయా వ్యాసార్థం గల మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు పనులకు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అంచనా. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని టీఎస్ ఐఐసీ సంస్థ జలమండలికి డిపాజిట్ చేయాల్సి ఉంది.
మహానగరం పరిధిలో ఏదేని అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి నీటి సరఫరా చేయాలంటే ముందుగానే డిపాజిట్ వసూలు చేయడం జలమండలి పాటిస్తున్న నిబంధన. కానీ ఈ విషయంలో కొందరు అధికారులు బోర్డును తప్పుదోవ పట్టించి సదరు సంస్థ నిర్మాణ వ్యయాన్ని డిపాజిట్ చేయకముందే టెండర్లు పిలిచి తమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. మరోవైపు తాజాగా పనులు దక్కించుకుంటున్న వారికి సైతం ఈ రంగంలో అంతగా అనుభవం, అర్హతలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భాగోతంలో తమకు బాగానే గిట్టుబాటవుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ఈ తతంగం నడిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమాల దారిలో..
సాధారణంగా రూ.కోటి... అంతకంటే ఎక్కువ నిర్మాణ వ్యయమయ్యే పనులను జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. కానీ ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో తమకు సంబంధం లే ని పనులకు టెండర్లు పిలవడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇదే క్రమంలో మారేడ్‌పల్లి నిర్వహణ డివిజన్ పరిధిలో రూ.9.20 కోట్లతో చేపట్టే రిజర్వాయర్ పనులు, ఫతేనగర్, షాపూర్, తార్నాక, ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 కోట్లతో నిర్మించే రిజర్వాయర్ పనులను ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలో చేపట్టేందుకు రంగం సిద్ధమవడం గమనార్హం. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం జోక్యం చేసుకుంటే అక్రమాల డొంక కదులుతుందని బోర్డు ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
అక్రమాలు రూ.కోట్లు దాటుతున్నాయ్!
Published Sun, Mar 15 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement