Waterboard officials
-
‘సరోజినీదేవి’కి నీటి సరఫరా పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: సరోజినీదేవి కంటి ఆసుపత్రికి జలమండలి అధికారులు శనివారం నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వద్ద వాల్వ్‌ను మార్చడంతో ఆసుపత్రికి సరఫరా అయ్యే నీటి నాణ్యత, రంగు మెరుగుపడ్డాయన్నారు. నీటి నాణ్యత పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కంటి ఆసుపత్రిని శని వారం ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ డెరైక్టర్ ఆపరేషన్ రామేశ్వర్రావు, గోషామహల్ సర్కిల్ -3 చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, జలమండలి జనరల్ మేనేజర్ స్వామి, క్వాలిటీ అక్యూరెన్స్ టెస్టింగ్ జీఎం తన్నీరుజవహార్ ఆసుపత్రిని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని నీటిసంపులను, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశీ లించగా నాచు పేరుకొని పోయి అపరిశుభ్రంగా కనిపించాయి. ఈ కారణంగానే ఆసుపత్రిలో మురుగు నీటి సమస్య తలెత్తిందని తేల్చారు. -
అక్రమాలు రూ.కోట్లు దాటుతున్నాయ్!
- నిబంధనలకు నీళ్లు - డిపాజిట్ చేయకముందే పనులు కట్టబెట్టేందుకు సన్నాహాలు - జలమండలి అధికారుల నిర్వాకం సాక్షి,సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. జలమండలి ఆధ్వర్యంలో మాదాపూర్ స్పోర్ట్స్ సిటీకి మంచి నీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రూ.20 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే అంతకుముందేతమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేం దుకు జలమండలి అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.20 కోట్ల విలువైన పనులను సాధారణంగా జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. దీనికి భిన్నంగా ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలోనే చేపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి పనులు కట్టబెట్టేందుకే ఈ తతంగం ఆగమేఘాల మీద జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదీ కథ... మాదాపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వెనుక వైపున నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీకి మంచినీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ముందుకొచ్చింది. దీనికి సైబర్ గేట్‌వే ప్రాంతంలోని విప్రో సంస్థ వె నుక వైపున 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (జీఎల్ఎస్ఆర్) నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్సిటీకి మంచినీటి సరఫరాకు 800 డయా వ్యాసార్థం గల మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు పనులకు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అంచనా. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని టీఎస్ ఐఐసీ సంస్థ జలమండలికి డిపాజిట్ చేయాల్సి ఉంది. మహానగరం పరిధిలో ఏదేని అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి నీటి సరఫరా చేయాలంటే ముందుగానే డిపాజిట్ వసూలు చేయడం జలమండలి పాటిస్తున్న నిబంధన. కానీ ఈ విషయంలో కొందరు అధికారులు బోర్డును తప్పుదోవ పట్టించి సదరు సంస్థ నిర్మాణ వ్యయాన్ని డిపాజిట్ చేయకముందే టెండర్లు పిలిచి తమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. మరోవైపు తాజాగా పనులు దక్కించుకుంటున్న వారికి సైతం ఈ రంగంలో అంతగా అనుభవం, అర్హతలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భాగోతంలో తమకు బాగానే గిట్టుబాటవుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ఈ తతంగం నడిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాల దారిలో.. సాధారణంగా రూ.కోటి... అంతకంటే ఎక్కువ నిర్మాణ వ్యయమయ్యే పనులను జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. కానీ ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో తమకు సంబంధం లే ని పనులకు టెండర్లు పిలవడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇదే క్రమంలో మారేడ్‌పల్లి నిర్వహణ డివిజన్ పరిధిలో రూ.9.20 కోట్లతో చేపట్టే రిజర్వాయర్ పనులు, ఫతేనగర్, షాపూర్, తార్నాక, ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 కోట్లతో నిర్మించే రిజర్వాయర్ పనులను ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలో చేపట్టేందుకు రంగం సిద్ధమవడం గమనార్హం. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం జోక్యం చేసుకుంటే అక్రమాల డొంక కదులుతుందని బోర్డు ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. -
గోదావరికి కొత్త రూట్..!
సాక్షి,సిటీబ్యూరో: గోదావరి జలాలు సిటీలో గలగలా పారించేందుకు జలమండలి అధికారులు కొత్త రూట్ సిద్ధం చేస్తున్నారు. జలమండలి ప్రాజెక్టు సమీక్షలో సీఎం చేసిన సూచనల ఆధారంగా కసరత్తు ప్రారంభించారు. కొత్త రూట్లో పైప్లైన్ల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందించేపనిలో పడ్డారు. విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ)ద్వారానే రాజధాని నగరానికి నీటిని తరలించవచ్చు. పైపులైను మార్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీరనుంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకానికి కూడా సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ఇటీవల జలమండలి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ఈ పథకానికి కొత్త మార్గాన్ని సూచించారు. కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాలతో జలమండలి అధికారులు ప్రతిపాదనులు రూపొందిస్తున్నారు. కొత్త మార్గం ఇలా.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట్ వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో 186 కి.మీ మార్గంలో గోదావరి మంచినీటి పథకం పైప్‌లైన్ పనులను 2008లో ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం మొదటి దశ ద్వారా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. పాత మార్గం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి-బొమ్మకల్-మల్లారం నీటిశుద్ధికేంద్రం-కొండపాక-ఘన్పూర్-శామీర్‌పేట్(నగర శివారు) మార్గంలో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం సూచనల ప్రకారం కొత్త మార్గంలో బొమ్మకల్రిజర్వాయర్ను మినహాయించి ఎల్లంపల్లి(126 మీటర్ల ఎత్తున్న కాంటూరు)నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం జగిత్యాల మార్గంలో ఎత్తై కొండ ప్రాంతం ఎండపల్లి(480మీటర్ల ఎత్తు)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ఆధారంగా 10 టీఎంసీల నీటిని మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి తరలించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో కొత్త మార్గం సాధ్యాసాధ్యాలపై జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోదావరి పథకం తొలిదశను ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశంచడంతో గోదావరి పథకం రెండోదశలో భాగంగా ఈ కొత్త మార్గం గుండా నీటిని తరలించాలా ? లేదా తొలిదశలోనే ఈ మార్గం గుండా నగరానికి నీటిని తరలించాలా ? అన్న అంశంపై అధికారులు పరిశీలనచేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తరవాత కొత్త మార్గంపై సీఎంకు నివేదిస్తామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం తాము క్షేత్రస్థాయి పరిశీలన మాత్రమే జరుపుతున్నామని స్పష్టంచేశారు. నూతన మార్గంలో నేల వాలును తెలిపే కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసిన తరవాతనే కొత్త మార్గంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తీరనున్న పలు గ్రామాల దాహార్తి.. సీఎం సూచనల ప్రకారం గోదావరి ప్రస్తుత మార్గాన్ని స్వల్పంగా మార్చిన పక్షంలో పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న కరీంనగర్,మెదక్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల దాహార్తి తీరనుందని, అక్కడి జిల్లా గ్రిడ్లకు ఈ మార్గం దాహార్తిని తీర్చే వరదాయినిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త మార్గం గుండా పైప్లైన్లు వేస్తే నీటి పంపింగ్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.