పట్నం శిగలో మరో నగ! | Hyundai Car Company Starts In Eliminedu At Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

పట్నం శిగలో మరో నగ!

Published Wed, Oct 2 2019 8:47 AM | Last Updated on Wed, Oct 2 2019 8:47 AM

Hyundai Car Company Starts In Eliminedu At Ibrahimpatnam - Sakshi

ఎల్మినేడులో హ్యుందాయ్‌ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనున్న స్థలం ఇదే..

సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్నం శిగలో మరో నగ మెరువనుంది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ ప్రాంతంలో కొలువుదీరడంతో ఇబ్రహీంపట్నం ఖ్యాతి ప్రంపంచ స్థాయిలో మారుమోగుతోంది. రక్షణ రంగ సంస్థలైన అక్టోపస్, బీడీఎల్, ఎన్‌ఎస్‌జీ తదితర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఆదిబట్లలో టాటా ఏరోస్పేస్, టాటా లాకిడ్‌ మార్టిన్, బోయింగ్‌ విమానాల తయారీ కంపెనీ, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ తదితర సంస్థలు పట్నం నియోజకవర్గం చుట్టూ ఏర్పాటైన విషయం తెలిసిందే. వీటిరాకతో ఈ ప్రాంతంలో రియల్‌వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందం మాదిరిగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పడమర ప్రాంతం ఆదిబట్ల, బొంగ్లూర్, కొంగరకలాన్‌  ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు రాకతో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తూర్పు భాగంలో రక్షణ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి.

కొలువుదీరనున్న హ్యుందాయ్‌ 
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు వ్యవసాయాధారిత గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం వైపు బహుళజాతి కంపెనీలు చూస్తున్నాయి. ఈక్రమంలో ఆదిబట్ల తరహాలో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. ఎల్మినేడు గ్రామంలో హ్యుందాయ్‌ కార్ల కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్‌ఐఐసీ ద్వారా భూములు సేకరించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా భూములు సేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. కార్ల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న హ్యుందాయ్‌ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లేనని తెలుస్తోంది.

గతంలో ఏరోస్పేస్‌ ఏర్పాటు కోసం ఇక్కడ భూములు కేటాయించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. భవిష్యత్తు అవసరాల కోసం అదే స్థానంలో ఈ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆదిబట్లలో హెలీకాప్టర్‌ విభాగాలు, బోయింగ్‌ విమానాల తయారీ అవుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎల్మినేడులో కార్ల తయారీ కంపెనీ కొలువు దీరనున్న నేపథ్యంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. పరిశ్రమల శాఖ ఈ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. సూమారు 2 వేల మందితో పని చేసే ఈ కంపెనీలో సుమారు రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

జోరుగా కొనసాగుతున్న సర్వే 
ఎల్మినేడు గ్రామంలోని సర్వే నంబరు 512లో 378.09 ఎకరాలు ప్రభుత్వ భూమి, సర్వే నంబరు 166లో 108.09 ఎకరాలు, 421 నంబర్‌లో 178.33 ఎకరాలు , సర్వే నంబరు 492లో 1.17 ఎకరాల భూములను సేకరిచేందుకు టీఎస్‌ఐఐసీ అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలు తీసుకోనుంది. గతంలో ఇచ్చిన పరిహారం కంటే లక్ష రూపాయలు ఎక్కువగా ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులను ఒప్పించడానికి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ భూముల సర్వే వేగవంతంగా సాగుతోంది. రెండుమూడు రోజులుగా ఎల్మినేడు గ్రామంలోనే ఉండి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. వారి భూములను కంపెనీ ఏర్పాటు చేసేందుకు సేకరించనున్నట్లు తెలియజేశారు. దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది.  దసరా తరువాత పరిహారం అందజేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మారనున్న రూపురేఖలు 
కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు ఇక్కడ కొలువు దీరడంతో రియల్‌ ఎస్టేట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎల్మినేడుతో పాటు కప్పపహాడ్, తుర్కగూడ, ఎర్రకుంట, తులేకలాన్, పోచారం, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూమల ధరలు త్వరలో బంగారం కానున్నాయి. ఇప్పటికే ఒక్కో ఎకరం సుమారు రూ.75 లక్షలకు పైగా పలుకుతున్నాయి. హ్యుందాయ్‌ కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే అప్రమత్తమైన రియల్టర్లు ఎల్మినేడు ప్రాంతంలోని భూములు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.   

పట్నం మరింత అభివృద్ధి   
ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరాయి. వాటి ఏర్పాటుకు చాలా కృషి చేశాను. ఈ ప్రాంతంలో వివిధ కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఎల్మినేడులో హ్యుందాయ్‌ కార్ల తయారీ పరిశ్రమ రాబోతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఆదిబట్ల తరహాలో ఎల్మినేడును తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కూడా పెరుగుతుంది. త్వరలోనే కంపెనీ ఏర్పాటుక సేకరించే భూములకు పరిహారం చెల్లింపునకు అ«ధికారులతో మాట్లాడుతాను. 
 – మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement