జోరందుకోనున్న డ్రైపోర్టులు  | Dri Ports going to speed up | Sakshi
Sakshi News home page

జోరందుకోనున్న డ్రైపోర్టులు 

Published Sun, May 12 2019 3:19 AM | Last Updated on Sun, May 12 2019 3:19 AM

Dri Ports going to speed up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ భూభాగమే ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు డ్రైపోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ డ్రైపోర్టుల ఏర్పాటు ప్రతిపాదన తెరమీదకు వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా భూసేకరణ కొలిక్కి రావడం లేదు. నాలుగు చోట్ల డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించగా, సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) యోచిస్తోంది. హైదరాబాద్‌– విజయవాడ మార్గంలో నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎగుమతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పారిశ్రామిక, ఇతర ఎగుమతులను ఏటా లక్ష కోట్ల రూపాయల నుంచి 1.50 లక్షల కోట్లకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం లేకపోవడంతో పోర్టు స్థానంలో డ్రైపోర్టులను ఏర్పాటుచేసుకోవడంపై దృష్టిపెట్టింది.

రాష్ట్రంలో డ్రైపోర్టుల ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను లండన్‌ కేంద్రంగా ఉన్న ‘ఎర్నెస్ట్‌ యంగ్‌’అనే అంతర్జాతీయ కన్సల్టెన్సీకి గతంలో అప్పగించింది. రాష్ట్రం నుంచి వివిధ రంగాలకు సంబంధించి ఎగుమతి అవకాశాలు, రోడ్లు, రైలు మార్గాల్లో ట్రాఫిక్‌ తదితరాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. 65వ నంబరు జాతీయ రహదారిపై జహీరాబాద్‌ వద్ద, 163వ నంబరు జాతీయ రహదారిపై భువనగిరి వద్ద, హైదరాబాద్‌–బెంగళూరు మార్గంలో 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద, మిర్యాలగూడ–వాడపల్లి మార్గంలో దామరచర్ల వద్ద డ్రైపోర్టుల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. డ్రైపోర్టు ఏర్పాటుకు కనీసం 400 ఎకరాల భూమి అవసరమవుతుందనే అంచనాతో భూసేకరణపై టీఎస్‌ఐఐసీ దృష్టి సారించింది. 

తొలి డ్రైపోర్టుకు ‘చిట్యాల’ఎంపిక 
రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశముందని ఆ కన్సల్టెన్సీ సంస్థ సూచించినా, ప్రస్తుతానికి ఏదో ఒక చోట మాత్రమే డ్రైపోర్టును అభివృద్ది చేయాలని నిర్ణయించారు. 2035 నాటికి పెరిగే రోడ్డు, రైలు ట్రాఫిక్‌ రద్దీని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతానికి ఒక డ్రైపోర్టు మాత్రమే రాష్ట్ర అవసరాలకు సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తొలిదశలో హైదరాబాద్‌–విజయవాడ మార్గంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ మార్గం మీదుగానే మచిలీపట్నం, విశాఖపట్నం ఇతర సముద్ర ఓడ రేవులకు సరుకులు రవాణా అవుతున్న నేపథ్యంలో తొలి డ్రైపోర్టును విజయవాడ మార్గంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. డ్రైపోర్టుకు రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం కీలకం కావడంతో హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో నల్లగొడ జిల్లా చిట్యాల అత్యంత అనువైన ప్రదేశమని టీఎస్‌ఐఐసీ అంచనాకు వచ్చింది. దీంతో భూసేకరణపై దృష్టి సారించి, ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐతో టీఎస్‌ఐఐసీ మంతనాలు జరుపుతోంది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ తనఖాకు సంబంధించిన 11వందల ఎకరాలు ప్రస్తుతం ఐసీఐసీఐ అదీనంలో ఉన్నాయి. ఇందులో డ్రైపోర్టు ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్‌ఐఐసీ మంతనాలు జరుపుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. 

సేకరణ తర్వాతే ప్రతిపాదనలు 
చిట్యాలలో ప్రతిపాదిత డ్రైపోర్టును పబ్లిక్, ప్రైవేటు భాగస్వా మ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అదానీ గ్రూప్‌ ఆసక్తి చూపుతోంది. అయితే భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపాలని టీఎస్‌ఐఐసీ యోచిస్తోంది. దేశంలో పారిశ్రామిక, ఇతర ఎగుమతులు ప్రోత్సహించేందుకు కనీసం 300 డ్రైపోర్టులు అవసరమని అంచనా కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 డ్రైపోర్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇందులో ఇన్‌లాండ్‌ కంటెయినర్‌ డిపోలు (ఐసీడీ), కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్లు (సీఎఫ్‌ఎస్‌), ఎయిర్‌ ఫ్రయిట్‌ స్టేషన్లు (ఏఎఫ్‌సీ) ఉన్నాయి. ఈ 21 డ్రైపోర్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాయి. ఈ 21 డ్రైపోర్టులలో రాష్ట్రానికి చెందిన ఒక్క ప్రాజెక్టూ లేకపోవడం గమనార్హం. 

ఇతర డ్రైపోర్టులపైనా దృష్టి 
తొలిదశలో చిట్యాల డ్రైపోర్టును అభివృద్ది చేస్తూనే మరో మూడు డ్రైపోర్టుల ఏర్పాటుకు అనువైన చోట భూ సేకరణ జరపాలని టీఎస్‌ఐఐసీ భావిస్తోంది. హైదరాబాద్‌–ముంబై మార్గంలో జహీరాబాద్‌ వద్ద నిమ్జ్‌ కోసం ప్రతిపాదించిన 450 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. హైదరాబాద్‌–బెంగుళూరు మార్గంలో జడ్చర్ల వద్ద అనువైన స్థలంపై అన్వేషణ కొనసాగుతోంది. హైదరాబాద్‌–వరంగల్‌ మార్గంలోనూ భువనగిరి ప్రాంతంలో మరో డ్రైపోర్టు ఏర్పాటుకు భూ సేకరణ జరపాలని టీఎస్‌ఐఐసీ భావిస్తోంది. అయితే రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి చిట్యాల డ్రైపోర్టు అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్‌ఐఐసీ కసరత్తు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement