♦ భూముల వేలానికి కొత్త రికార్డు ధర
♦ టీఎస్‌ఐఐసీకి రూ. 185 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. గత ఏడాది నిర్వహించిన వేలానికి మించి భూముల ధర పెరిగిపో యింది. మొత్తం ఐదు లాట్లలో 15 ఎకరాల భూముల విక్రయానికి టీఎస్‌ఐఐసీ ఈ నెల 10న ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించింది.
శుక్రవారం ఈ టెండర్లు తెరిచారు. బిడ్డర్లు ఎక్కువ ధర వెచ్చించి భూములను కొనుగోలు చేసేందుకు పోటీ పడటంతో గరిష్ట రేట్లు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల లాట్‌కు గరిష్టంగా గజానికి రూ. 88 వేల చొప్పున ధర చెల్లించేందుకు ఒక బిడ్డర్ టెండర్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడి భూమి ఎకరానికి రూ. 42.59 కోట్ల ధర పలికినట్లయిది. గతంలో ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో టీఎస్‌ఐఐసీ వేలం వేసిన భూములకు గరిష్టంగా ఎకరానికి రూ. 29 కోట్ల ధర వచ్చింది. ఇప్పుడు అంతకు మించి ధర పలకడం విశేషం.
మరో లాట్‌లో ఎకరా రూ. 29.33 కోట్లు
రాయదుర్గం ప్రాంతంలోనే 2.15 ఎకరాల మరో లాట్‌కు నిర్వహించిన టెండర్లలో గజానికి రూ. 60,600 చొప్పున కొనుగోలు చేసేందుకు మరో బిడ్డర్ ముందుకొచ్చారు. దీనికి ఎకరానికి రూ. 29.33 కోట్లు ధర పలికినట్లు స్పష్టమవుతోంది. ఇంకా టెండర్లు ఖరారు చేయకపోవటంతో బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, వ్యక్తుల పేర్లను టీఎస్‌ఐఐసీ యాజమాన్యం వెల్లడించ లేదు.
ఈ రెండు లాట్లకు మొత్తం ఎనిమిది బిడ్లు దాఖలు కాగా, మిగతా మూడు లాట్లకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. గరిష్ట ధర చొప్పున లెక్కగడితే ఈ విడత భూముల విక్రయంతో టీఎస్‌ఐఐసీకి రూ. 185 కోట్ల ఆదాయం సమకూరుతుందని టీఎస్‌ఐఐసీ వర్గాలు అంచనా వేశాయి. ప్రధానంగా హైదరాబాద్ సుస్థిర నగరాభివృద్ధి, శాంతిభద్రతలు, ఐటీ రంగ వృద్ధి కారణంగానే భూముల విక్రయానికీ విశేష స్పందన లభించిందని టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు.
రాయదుర్గంలో ఎకరా రూ. 42.59 కోట్లు
Published Fri, May 19 2017 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement