సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో ఏప్రిల్ 28న అనుమతి ఇచ్చింది. అయితే అనుమతిచ్చి వారం కావస్తు న్నా పరిశ్రమల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారం భించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరం, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టినా కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావట్లేదు.
టీఎస్‌ఐఐసీ పరిధిలోని పారిశ్రామికవా డల్లో 30 శాతం పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) చెప్తోం ది. ఇందులో ఎక్కువ గా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించలేదు. ముడి సరుకులు, ఫినిషింగ్ గూడ్స్‌ను మార్కెట్‌కు తరలించే పరిస్థితి లేకపోవడంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు పారి శ్రామిక వర్గాలు వెనుకంజవేస్తున్నాయి. మరోవైపు వ లస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండటం పరిశ్రమలు తెరుచుకోకపోవడానికి మరో కారణం.
ఐటీ రంగంలో లే ఆఫ్‌లు: లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు, ఆదాయం లేక ఉద్యోగులను తొలగించేం దుకు పలు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు పలు కంపెనీలు అంతర్గతంగా టెర్మినేషన్ లెటర్లను ఉద్యోగులకు ఇస్తున్నాయి. పలు కంపెనీలు ‘లే ఆఫ్’కు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు, ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు కమిటీ ముందుకు 42 ఫిర్యాదులు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు సగానికి పైగా ఫిర్యాదులపై విచారణ పూర్తయిందని, మిగతా ఫిర్యాదులపైనా కమిటీ విచారణ జరుపుతోందన్నారు. కొన్ని కంపెనీలు లే ఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సుముఖత చూపినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటు కొన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటించకుండా వేతనాల్లో కోత, అన్ పెయిడ్ హాలిడేస్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి.
నిర్మాణ రంగం పరిస్థితి కొంత మెరుగు..
పారిశ్రామికరంగంతో పోలిస్తే నిర్మాణ రంగం పనులు వేగంగా తిరిగి ప్రారంభమవుతున్నట్లు భవన నిర్మాణదారులు, డెవలపర్లు చెప్తున్నారు. వారం వ్యవధిలో 40 శాతం కార్యకలాపాలు ప్రారంభం కాగా, పనులు ప్ర స్తుతానికి ఒకే షిఫ్టులో జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని మెగా ప్రాజెక్టుల్లో మూడు షిఫ్టుల్లో పనుల ప్రారంభానికి మరికొంత సమయం పట్టొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment