సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఎస్‌ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులకు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ముందుకొచ్చింది. టీఎస్‌ఐఐసీ ద్వారా పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కూడా రుణాలివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో బుధవారం పరిశ్రమ భవన్‌లో బీవోఐ (నేషనల్ బ్యాకింగ్ గ్రూప్, సౌత్) వినియోగదారుల సంబంధాల కార్య నిర్వహణాధికారి వినయ్‌దీప్ మట్టా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్‌వీ సూర్యనారాయణరాజు భేటీ అయ్యారు. టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులకు, కొత్త ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించనున్నట్టు వారు తెలిపారు. భూముల కొనుగోళ్లకు మినహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రుణ సదుపాయం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగులకు విరివిగా రుణాలను అందించాలని బీవోఐ అధికారులకు బాలమల్లు సూచించారు.