Parks Development
-
భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!
ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో. ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్‌కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్‌లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు. పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్‌కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది? వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’. ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్‌టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్‌లను కాని, వాకింగ్ ట్రాక్‌లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి. స్త్రీల నిర్వహణ పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్‌కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్‌ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు. ప్రతి ఊరిలో అవసరం బిజీ లైఫ్‌లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్‌లు రావాలని ఆశిద్దాం. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
అప్పారెల్ పార్క్‌లతో ఉపాధి అవకాశాలు
అచ్యుతాపురం: దేశంలో మరిన్ని అప్పారెల్ పార్కులు ఏర్పాటు చేయడం అవసరమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ అన్నారు. ఆయన గురువారం విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని బ్రాండిక్స్ అప్పారెల్ పార్క్‌లో పరిశ్రమలను సందర్శించారు. బ్రాండిక్స్ ఇండియన్ పార్టనర్ దొరస్వామి ఆయనకు అక్కడ జరుగుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సీఈవో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగమే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. బ్రాండిక్స్ అనుసరిస్తున్న విధానంలో మరిన్ని పార్క్‌లు ఏర్పాటు కావాలన్నారు. నామమాత్రపు చదువుతో కార్పొరేట్ స్థాయి పరిశ్రమలో ఉపాధిని అందిపుచ్చుకున్న మహిళలను ఆయన అభినందించారు. పలువురు మహిళా కార్మికులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు కల్పిస్తున్న రవాణా, రక్షణ, క్యాంటీన్ సౌకర్యాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బ్రాండిక్స్ అప్పారెల్ పార్క్ శ్రీలంక పార్టనర్స్‌తో వీడియోకాల్‌లో మాట్లాడి పలు అంశాలను తెలుసుకున్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు ఉన్నారు. -
పల్లె పార్క్‌లకు స్థల సమస్య
సాక్షి, నిజామాబాద్ : నగరాలు, పట్టణాల మా దిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు స్థలాల సమస్య వెంటాడుతోంది. వీటిని ఏర్పాటు చేసేందుకు సౌకర్యవంతమైన ప్రభుత్వ భూమి గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యి. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను, సుమారు 70 గ్రామ పంచాయతీల్లో స్థలాలు అందుబా టులో లేవు. దీంతో స్థలాలు లేనిచోట్ల పనులు ప్రారంభం కావడం లేదు. ఒక్కో ప్రకృతి వనాన్ని కనీసం ఎకరం స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు వీటిని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పలు గ్రామాల్లో ఎకరం విస్తీర్ణం లేకపోవడంతో అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. పనులు చేపట్టిన 460 గ్రామాల్లోని 59 గ్రామాల్లోని అటవీభూముల్లో ఈ పార్కులను నిర్మిస్తున్నారు. 401 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ, ఆబాదీభూములున్నాయి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూముల కొరత ఉండటం సాధారణం. కానీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు పల్లె ప్రకృతి వనాల విషయానికి వస్తే గ్రామాల్లో సైతం ప్రభుత్వ భూముల సమస్య తెరపైకి రావడం గమనార్హం. ఆర్డీవోలకు బాధ్యతలు.. పల్లె ప్రకృతి వనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. నిర్మాణం ప్రారంభం కాని గ్రామ పంచాయతీల్లో భూముల గుర్తింపు బాధ్యతలను కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆర్డీవోలకు అప్పగించారు. వీలైనంత త్వరగా భూములను గుర్తించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కాని గ్రామాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే ఆ భూములను స్వాధీనం చేసుకుని పార్కుకు కేటాయిస్తారు. సమీపంలో అటవీభూములుంటే కూడా వాటిలో ఈ పార్కులను నిర్మిస్తారు. ఇవేవీ అందుబాటులో లేనిపక్షంలో గ్రామాల్లో దాతల నుంచి భూములు సేకరించాలని భావిస్తున్నారు. వేగంగా పనులు.. జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా సాగుతున్నాయి. స్థలాలు అప్పగించిన 460 గ్రామాల్లో వీటి నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 గ్రామాల్లో ఈ వనాల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా ఒక్కో ప్రకృతి వనాన్ని రూ.5.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల వరకు నిర్వహణ నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తున్నారు. ఈ వనాల్లో ప్రతి మూడు ఫీట్లకు ఒకటి చొప్పున మొక్కలు నాటుతున్నారు. వనం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు. నడక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
అందుబాటులోకి మరో రెండు అర్బన్ పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర వాసులకు మరో రెండు అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయు పార్క్‌లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలికోసం హైదరాబాద్‌కు నలువైపులా ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరిట రిజర్వ్ ఫారెస్టులను అభివృద్ధి చేస్తోందన్నారు. దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రూ.74 లక్షల వ్యయంతో బెంచ్‌లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్ కోర్ట్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ గేమ్‌జోన్ ఏరియా ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, మేడ్చల్ జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పార్కులకు సొబగులు అద్దండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని 20 ప్రధాన జంక్షన్లు, ప్రధాన రహదారుల్లోని మీడియన్లను కొత్తగా ముస్తాబు చేయాలని, గన్‌పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంపై గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 236 కిలోమీటర్ల విస్తీర్ణంలో 153 రోడ్లపై సెంట్రల్ మీడియన్లు ఉన్నాయని, వీటిలో వంద కిలోమీటర్ల మీడియన్లను మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా 20 ప్రధాన జంక్షన్లను సీఎస్సార్ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. 873 ల్యాండ్ స్కేప్ పార్కులు, 331 ట్రీ పార్కులు ఉన్నాయని, మరో 616 ఖాళీ స్థలాల్లో పార్కులు, ప్లాంటేషన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పార్కుల అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వాటి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇందిరా పార్కు, జూబ్లీహిల్స్‌లోని రాక్ గార్డెన్‌ను ఆధునిక రీతిలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇకపై ‘హరిత శుక్రవారం’ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి శుక్రవారం హరిత దినోత్సవంగా పాటిస్తున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా జోనల్, డిప్యూటీ కమిషనర్లు విధిగా తమ పరిధిలోని పార్కులను సందర్శించి కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశమై వాటి అభివృద్ధిపై చర్చించాలని ఆదేశించారు. హరిత శుక్రవారంలో వివిధ వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. హరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60 లక్షల మొక్కలను 56 నర్సరీల్లో పెంచుతున్నట్టు తెలిపారు. ఈసారి హరితహారంలో జీహెచ్ఎంసీకి 3 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, నగరంలో ఉన్న 331 ట్రీ పార్కుల్లో విస్తృతంగా> మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు దాసరి హరిచందన, ఆమ్రపాలి, కృష్ణ, జోనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్కుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. మొదటి దశలో హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను.. అటవీశాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ కార్పొరేషన్ 4, మెట్రో రైల్ 2, టూరిజం 7 పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్ కమిటీ మొదటి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. వివిధ విభాగాలకు కేటాయించిన పార్కుల అభివృద్ధి, వాటికి అవసరమైన ఆర్థిక వనరులపై ప్రధానంగా చర్చించారు. సీఎం ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల అటవీ ఉద్యానవనాలు నెలకొల్పుతున్నట్లు సీఎస్ తెలిపారు. స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని పార్కులు పూర్తి చేయాలని, పనులంతా పర్యావరణహితంగా జరగాలని ఆదేశించారు. -
పార్కుల అభివృద్ధికి 100 కోట్లు: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అర్బన్ పార్కుల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. శనివారం మంత్రి జోగురామన్న, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అటవీశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పార్క్‌ల్లో పర్యటించారు. నగరం చుట్టుపక్కల సుమారు 99 పార్కులున్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో వాటి అభివృద్ధి జరగలేదన్నారు. నగరం చుట్టూ పచ్చదనాన్ని పెంచి, అటవీ బ్లాక్‌లను మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. హైదరా బాద్‌ను ఆరోగ్యకర రాజధానిగా తీర్చిదిద్దడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల సమన్వయంతో ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. -
టీఎస్ఐఐసీ భూములపై రుణాలు
♦ నెల రోజుల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రణాళిక ♦ ఉత్పత్తి ప్రారంభించాకే పరిశ్రమలకు భూ రిజిస్ట్రేషన్ ♦ టీఎస్ఐఐసీ పనితీరుపై మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణకు తమ ఆధీనంలోని భూములపై రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి సూచించారు. సంస్థ కార్యాలయంలో మంగళవారం మంత్రి టీఎస్ఐఐసీ పనితీరును సమీక్షించారు. సమీక్షలో సంస్థ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన కన్సల్టెంట్ల ఎంపిక, ప్రాజెక్టు రిపోర్టుల తయారీ తదితరాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని గుర్తించడం, అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. టీఎస్ఐఐసీలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టీఎస్పీఎస్సీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే సంబంధిత సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని మంత్రి సూచించారు. టీఎస్ఐపాస్ విధానంలోని ప్రత్యేకతలను ప్రస్తావించిన జూపల్లి పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది పనిచేయాలన్నారు. పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములు, రాయిదుర్గ్ ఫైనాన్షియల్ జిల్లాలో భూముల కేటాయింపు, కేటాయింపులు జరిగినా వినియోగంలోకి రాని భూముల రద్దు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఫుడ్‌పార్కులు, ఫైబర్‌గ్లాస్ పార్కు, డ్రైపోర్టులు, టెక్స్టైల్ పార్కుల పురోగతి, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం, ఎంఎల్ఆర్ మోటార్స్, శ్రీదేవి ఫుడ్స్‌కు కేటాయించిన భూములు, గేమ్ సిటీ, టీ హబ్ డిజైనర్ ఎంపిక, మైక్రోసాఫ్ట్‌కు పొరుగున పుప్పాలగూడలో వీజేఐల్ కన్సల్టెంట్స్‌కు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. పారిశ్రామికవాడల స్థానిక సంస్థలను (ఐలా)అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చే అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినా ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక రూపొందించి క్రమం తప్పకుండా సమీక్షించాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు.