ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో.
ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్‌కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్‌లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు.
పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్‌కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది?
వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’.
ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్‌టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్‌లను కాని, వాకింగ్ ట్రాక్‌లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు.
నేరాలను దృష్టిలో పెట్టుకుని
ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి.
స్త్రీల నిర్వహణ
పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్‌కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్‌ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు.
ప్రతి ఊరిలో అవసరం
బిజీ లైఫ్‌లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్‌లు రావాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment