కొత్తగా ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు | Cabinet approves setting up of 7 mega integrated textile | Sakshi
Sakshi News home page

కొత్తగా ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

Published Thu, Oct 7 2021 6:12 AM | Last Updated on Thu, Oct 7 2021 6:12 AM

Cabinet approves setting up of 7 mega integrated textile - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్‌టైల్‌ రీజియన్, అపెరల్‌ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది.

ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్‌టైల్‌ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌/బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు టెక్స్‌టైల్‌ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది.

అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్‌ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్‌ ఫండ్‌ సైతం అందజేయనుంది. టెక్స్‌టైల్‌ పార్కులో వర్కర్స్‌ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్‌ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు.

నాన్‌–గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం
రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్‌–గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్‌ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement