రాష్ట్రానికి టెక్స్‌టైల్‌ పార్కు | Hyderabad: Pm Mitra Mega Textile Parks To Be Set Up In 7 States Says Pm Narendra Modi | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి టెక్స్‌టైల్‌ పార్కు

Published Sat, Mar 18 2023 2:18 AM | Last Updated on Sat, Mar 18 2023 3:33 AM

Hyderabad: Pm Mitra Mega Textile Parks To Be Set Up In 7 States Says Pm Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్‌టైల్‌ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్‌ (ఫార్మ్‌–ఫైబర్‌–ఫ్యాక్టరీ–ఫ్యాషన్‌–ఫారిన్‌) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు నెలకొల్పనున్నట్టు మోదీ శుక్రవారం ట్వీట్‌లో తెలిపారు. తెలంగాణలో వరంగల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ (లక్నో), మధ్యప్రదేశ్‌ (ధార్‌), మహారాష్ట్ర (అమరావతి), తమిళనాడు(విరుదునగర్‌), కర్ణాటక (కల్బుర్గి), గుజరాత్‌ (నవ్‌సారీ)ల్లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు కానున్నాయి.

ఒక్కో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా ప్రత్యక్షంగా ఒక లక్ష ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా 2 లక్షలమందికి ఉపాధి కలి్పంచేందుకు అవకాశం ఉండనుంది. అంతేగాక ఒక్కో మెగా టెక్స్‌టైల్‌ పార్కు సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ద్వారా మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు పనుల పర్యవేక్షణ జరుగనుంది. 

మోదీ ఇచ్చిన మాట మేరకు.. 
లక్షలాదిమంది రైతులకు, చేనేత కారి్మకులకు ఉపయోగపడటంతోపాటు, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్‌ పార్కును తెలంగాణకు ప్రకటించటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన విజయ సంకల్పసభలో మెగా టెక్స్‌టైల్‌ పార్కును తెలంగాణకు ఇస్తామన్న ప్రధాని ఇచి్చన మాటకు కట్టుబడి అధికారికంగా ప్రకటన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వ్రస్తాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్‌టైల్‌ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్రమంత్రి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి కోరారు.  

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌కు ఊతం.. 
‘ఫైబర్‌ టు ఫ్యాబ్రిక్‌’నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ జిల్లా లోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని 1200 ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు’ను ఏర్పాటు చేసింది. 2017లో ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన టీఎస్‌ఐఐసీ ద్వారా కొంత మేర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పను లు కూడా జరిగాయి. అంతర్గత రహదారులు, విద్యుత్‌ తదితర వసతులను సమకూర్చడంతో యంగ్‌వన్, గణేశా ఈకో వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి.

అయితే దీనికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కలి్పంచేందుకు రూ.897 కోట్లు ఇవ్వాలని గతంలో మంత్రి కేటీఆర్‌ పలు సందర్భాల్లో కేంద్రా నికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పీఎం మిత్ర’టెక్స్‌ టైల్‌ పార్కు పథకంలో వరంగల్‌ను చేర్చడం ద్వారా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కొత్తగా కాలుష్య శుదీ్ధకరణ ప్లాంటు, ఇతర మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో టీఎస్‌ఐఐసీ ద్వారా కొంత మేర వసతుల కల్పన జరిగిందన్నారు. ఇప్పుడు ‘పీఎం మిత్ర’ కింద ఎంత మేర నిధులు వస్తాయనే సమాచారం ఇంకా తమకు అందలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement