
గడువు కంటే ముందే లక్ష్యం సాధిస్తాం
‘భారత్ టెక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రతిఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2030ని డెడ్‌లైన్‌గా విధించింది. అయితే, గడువు కంటే ముందే అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న విశ్వాసం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం ‘భారత్ టెక్స్–2025’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్త్రాల ఎగుమతిలో ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని తెలిపారు.
మనం ప్రతిఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన వస్త్రాలు ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. దీన్ని మూడు రెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో వస్త్ర టెక్స్‌టైల్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మనం ఇలాగే కష్టపడి పనిచేస్తే గడువు కంటే ముందే ఏటా రూ.9 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేయగలమని స్పస్టంచేశారు.
టెక్స్‌టైట్ రంగంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.75 కోట్లు అవసరమని, దీంతో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అడుగుపెడుతున్న ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంక్‌లకు సూచించారు. వస్త్ర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 5ఎఫ్ విజన్‌ను ప్రధానమంత్రి ప్రతిపాదించారు.
ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఈ విజన్‌తో రైతులకు, నేత కార్మికులకు, డిజైనర్లకు, వ్యాపారులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన నూతన పరికరాల తయారీ కోసం ఐఐటీల వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని వ్యాపారులకు సూచించారు. భారత్ టెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హై–గ్రేడ్ కార్బన్, ఫైబర్ తయారీ దిశగా మన దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment