రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రంగా రాష్ట్రం
డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కుకు వెయ్యి ఎకరాలు
ఏరోస్పేస్ సదస్సులో పరిశ్రమల మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగ పరిశ్రమలకు హైదరాబాద్ ఇప్పటికే కేంద్ర బిందువుగా ఉందని, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏరోస్పేస్ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించినందునే తమ ప్రభుత్వం ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కు ఏర్పాటుకు ఎలిమినేడులో వెయ్యి ఎకరాలు కేటాయించిందన్నారు. ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కీన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న రెండో ‘డిఫెన్స్, ఏరో సప్లై ఇండియా 2015’ సదస్సులో మంత్రి జూపల్లి పాల్గొని ప్రసంగించారు. వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతం కావడంతో ైెహదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే డీఆర్‌డీఎల్, బీడీఎల్, డీఎంఆర్‌ఎల్, మిధాని, ఆర్‌సీఐ, ఎన్‌ఎఫ్‌సీ, ఓడీఎఫ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో ఏరోస్పేస్ పరికరాల తయారీకి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటైనట్లు తెలిపారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇప్పటికే హెలికాప్టర్ క్యాబిన్లు తయారు చేస్తుండగా, త్వరలో అమెరికాకు చెందిన సిర్కోస్కీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా మరో యూనిట్ ప్రారంభిస్తుందని వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రంలో సుమారు వేయికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పని చేస్తున్నాయని జూపల్లి వెల్లడించారు. సదస్సులో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు వివిధ ఏరోస్పేస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.