కాలుష్యం వెదజల్లితే చర్యలు
కొత్తూరు : రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తామని అదే సమయంలో కాలుష్యాన్ని వెద జల్లి ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రాష్ట్రంలో మూతపడినవాటితో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన మంగ ళవారం మండలంలోని పలు పరిశ్రమలను సందర్శించారు. ఆయన వెంట మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. కొత్తరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో త్వరలో జిల్లాలో పలు బహుళజాతి పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు షాద్‌నగర్ పట్టణంలో పలు శిక్షణకేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలో వేల ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. త్వరలో జిల్లాకు సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఓ పెద్దసంస్థ కృషిచేస్తుంద న్నారు.
స్పాంజ్ ఐరన్ పరిశ్రమ కాలుష్యంపై ఆగ్రహం
మండలంలోని నర్సప్పగూడ గ్రామంలో కొనసాగుతున్న శ్యాంబాబా ఫెర్రోఅల్లాయిస్ ఐరన్ పరిశ్రమను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ పరికరాలు ఉన్నప్పటికీ కరెంట్ బిల్లులు తగ్గించాలనే ఉద్ధేశంతో వాటిని వినియోగించడం లేదని తెలుసుకున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్ర మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను ఆదేశించారు.
టెక్సైటైల్ పార్కు సబ్సిడీని రికవరీ చేయాలి
చేగూరు శివారులో హైటెక్స్ టెక్స్‌టైల్ పార్కు పేరుతో కొందరు గతంలో సుమారు 121ఎకరాలు తీసుకుని పూర్తిచేయలేదని.. నిర్వాహకులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రూపంలో తీసుకున్న రూ.13కోట్లను తక్షణమే రికవరీచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం సిద్ధాపూర్ శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదే వి, ఎస్పీ విశ్వప్రసాద్, జేసీ రాంకిషన్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నేత వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు ఉన్నారు.
స్థానికులను నియమించుకోవాలి
జడ్చర్ల: జిల్లాను పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయరంగం, ఇతర రంగా ల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం వారు మండలంలోని పోలేపల్లి సెజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హెటెరో ఫార్మా పరిశ్రమలో విలేకరులతో మాట్లాడారు. సెజ్, తదితర పరిశ్రమల్లో దాదాపు 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పోస్టులకు స్థానికంగా అభ్యర్థులు లేని సమయంలో ఇతర ప్రాంతానికి చెందిన వారిని నియమించుకున్నా ఫర వాలేదని, అన్‌స్కిల్‌డ్, తదితర పోస్టులకు స్థానికులకే అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు సూచించామని చెప్పారు.
భవిష్యత్‌లో ఫార్మా, బయోటెక్నాలజీ, డిఫెన్స్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, సెల్‌ఫోన్ తదితర అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. నిరుద్యోగుల్లో స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు శిక్షణ ఇచ్చేందుకుగాను పాలమూరు యూనివర్సిటీలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్, ఐకే వంటి పరిశ్రమలకు సంబంధించి కూడా గ్రామస్థాయిలో ఉపాది అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తామన్నారు.