కొత్త డాక్టర్లొచ్చారు | 919 Specialist Medical Posts was replaced | Sakshi
Sakshi News home page

కొత్త డాక్టర్లొచ్చారు

Published Sat, Jul 7 2018 1:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

919 Specialist Medical Posts was replaced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 919 మంది స్పెషలిస్ట్‌ వైద్యులను నియమించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ శివప్రసాద్, ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు తదితరుల నేతృత్వంలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. భర్తీ చేసిన వెంటనే సంబంధిత వైద్యులకు నియామక ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పంపారు. వారం రోజుల్లో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి జిల్లాలు, ఆసుపత్రుల వారీగా పోస్టుల కేటాయింపు చేస్తారు. వివిధ విభాగాల వారీగా 15 రకాల స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేశారు. ఆర్థోపెడిక్‌–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్‌–28, జనరల్‌ మెడిసిన్‌–68, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌–09, పల్మనరీ–39, ఆప్తల్మాలజీ–34, సైకియాట్రిక్‌–22, అనస్తీషియా–156, ఈఎన్‌టీ–17, పాథాలజీ–55, జనరల్‌ సర్జన్స్‌–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్‌–150 పోస్టులను భర్తీ చేశారు. 

సొంత జిల్లాల్లో కేటాయింపు.. 
రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆసుపత్రులు 31, ఏరియా ఆసుపత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్‌లో ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లు 14 ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 1,133 స్పెషలిస్టు పోస్టుల కోసం వైద్య విధాన పరిషత్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. అందుకు 2,200 మంది స్పెషలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు. 1,133 పోస్టుల్లో 919 పోస్టుల భర్తీ జరిగింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా నియామకాలు జరిపారు. వారు సాధించిన మార్కులు, పాసైన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నేళ్లయిందో దానికి వెయిటేజీ, కాంట్రాక్టు పద్ధతిలో ఇప్పటికే పనిచేస్తున్నట్లయితే దానికీ వెయిటేజీ, అలాగే రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. నియమించిన 919 మందిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. వైద్యులందరికీ సొంత జిల్లాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్లు డాక్టర్‌ శివప్రసాద్‌ పేర్కొన్నారు. 

అన్యాయం జరిగింది: నియామకాలు జరిపిన ప్రభుత్వం తక్షణమే ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదో చెప్పాలని కొన్ని వైద్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కొందరు కుమ్మక్కయినందునే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. అలాగే నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈఎన్‌టీ విభాగపు మెరిట్‌ లిస్టులో రోస్టర్‌ ప్రకారం ఐదో స్థానం వచ్చిందని డాక్టర్‌ అనిల్‌ చెబుతున్నారు. మొత్తం 18 పోస్టులు ఉన్నందున తప్పక రావాల్సి ఉందని, కానీ తుది నియామకపు ఉత్తర్వులో తన పేరు కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇక డాక్టర్‌ నరహరి అనే స్పెషలిస్టు మాట్లాడుతూ నోటిఫికేషన్‌ మార్చి 19న వచ్చిందని, దాని ప్రకారం 46 ఏళ్లున్న వారు అర్హులన్నారు. ఆ తేదీ నాటికి తనకు 45 ఏళ్ల 10 నెలలుందన్నారు. కానీ జూలై 1వ తేదీని కట్‌ ఆఫ్‌గా తీసుకోవడం శోచనీయమన్నారు. ఈఎన్‌టీ జాబితాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలోనూ తనకు విషయం చెప్పలేదని, అప్పుడు తన దరఖాస్తును తిరస్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం వయసు లేదంటూ భర్తీలో తన పేరు లేకుండా చేశారని ఆరోపించారు. 

వైద్య ఆరోగ్య మంత్రి హర్షం.. 
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి భారీ నియామకాలు జరిపామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీరిందన్నారు. మొదటిసారిగా అందుబాటులోకి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల స్పెషలిస్టులు వచ్చారన్నారు. ఈ నియామకాలతో మౌలిక వసతులతో పాటు వైద్యుల కొరత తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ఓపీ, ఐపీలకు అనుగుణంగా నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement