సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను నిలబెట్టాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. చికిత్స చేయా ల్సిన ప్రదేశాలే.. తగిన భద్రతా ప్రమాణాలు పాటించక తుదిశ్వాసకు కేంద్రాలుగా మారు తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల కాసుల కక్కుర్తి కూడా ఈ దుస్థితికి కారణామని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రి ఘటనతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కనీస స్పందనా లేదేం?
రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వపరంగా పర్యవేక్షణ కనిపించడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. రోహిణి ఆస్పత్రి ప్రమాదంలో ఇద్దరు చనిపోయినా వైద్యారోగ్య శాఖలో ఏ మాత్రం కదలిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు రోహిణి ఆస్పత్రి ప్రమాదం నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎలా ంటి చర్యలు తీసుకోబో తున్నారనేది ఆ శాఖలో ఉత్కంఠ కలిగించింది. కానీ ఉన్నతాధి కారులు మాత్రం ఏమీ జరగనట్లు గానే వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై జిల్లా అధికారుల ను ంచి కనీసం ఆరా కూడా తీయలేదని తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉన్న రోహిణిలో ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారులే చెబుతున్నారు. అయితే ఘటనకు కారణాలను తెలుసుకుని విశ్లేషించే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలను ప్రారంభించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారుల ‘భాగస్వామ్యం’తోనే..
రోహిణి ఆస్పత్రి దుర్ఘటనపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రోహిణి ఆస్పత్రి యాజమాన్యంలో ఓ ఉన్నతాధికారికి భాగస్వామ్యం ఉండడమే చర్యలపై వెనుకంజకు కారణమని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన రోహిణి ఆస్పత్రి సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా. దీంతో అధికారులు ఆస్పత్రిపై చర్యల విషయంలో వెనుకంజ వేస్తున్నా రనే చర్చ జరుగుతోంది. అసలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు భాగస్వాములుగా ఉండడమే రక్షణ చర్యల విషయంలో లోపాలకు కారణామని వైద్య వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
అనుమతులు అక్కర్లేదా..?
రాష్ట్రంలో అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి 6,964 వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఆస్పత్రులు 537 ఉన్నాయి. ఇలాంటివాటిలో చాలా ఆస్పత్రులు వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యుల భాగస్వామ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణకు ప్రధానంగా 15 శాఖల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ వైద్యశాఖ అధికారుల ‘చల్లని చూపు’ కారణంగా చాలా వరకు అనుమతులు లేకుండానే ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ‘‘వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు భాగస్వాములుగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు అనుమతుల విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా వెంటనే అనుమతులు ఇస్తున్నారు. ఇదే రోగుల భద్రతకు ఇబ్బందిగా మారుతోంది..’’ అని వైద్యారోగ్య శాఖ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment