అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రులకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు పూర్వ జిల్లాకేంద్రాల్లో వీటిని ప్రారంభించాల ని అధికారులను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో 5, కరీంనగర్‌లో 5, వరంగల్‌లో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టామని తెలిపారు. ‘అందరికీ అందుబాటులో ఆరోగ్యం’స్ఫూర్తితో ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని.. ఇందులో భాగంగా సర్కారు ఆస్పత్రుల బలోపేతం, కొత్త దవాఖానాల ఏర్పాటు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నామని వివరించారు.
డిసెంబర్‌లో 175 ప్రారంభం
గత నెలలో బేగంపేటలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఆస్పత్రికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక వైద్యం కోసం ప్రైవేటు క్లినిక్‌లలో డబ్బులు ఖర్చు చేసేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని చెప్పారన్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే వాటి విస్తరణకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్‌లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి సుమారు 175 దవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో మ్యాపింగ్
బస్తీ దవాఖానాలన్నింటినీ ఆన్‌లైన్‌లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే ఐటీ శాఖ సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో నెలకొల్పే 500 బస్తీ దవాఖానాలకు భవనాలు గుర్తించాలని, అందుబాటులో లేకుంటే కొత్తగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేస్తున్న 28 బస్తీ దవాఖానాలను వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలన్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్స్
తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల సేవలను కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెం టర్లకు మంచి స్పందన వస్తోందని మంత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తోందని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీ సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment