అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర | Government fires on Unnecessary surgeries | Sakshi
Sakshi News home page

అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర

Published Wed, Mar 1 2017 12:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర - Sakshi

అనవసర శస్త్రచికిత్సలపై సర్కారు కన్నెర్ర

ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు చేస్తున్న ఆరు ఆసుపత్రుల సీజ్‌
మంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ నుంచే ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు


సాక్షి, హైదరాబాద్‌: అనవసరంగా శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్యశాఖ కన్నెర్ర చేసింది. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తన సొంత జిల్లా కేంద్రంలోనే ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తున్న ఆరు ప్రైవేటు ఆసుపత్రులను సీజ్‌ చేశారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో గుబులు రేగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని యశోధర, షిర్డిసాయి, వసుధ, సాయి చందన్, మేఘన, ధనుష్‌ ఆసుపత్రులను సీజ్‌ చేసినట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఆయా ఆసుపత్రులు అనవసర శస్త్రచికిత్సలు, సిజేరియన్లు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కనీస నిబంధనలు పాటించకపోవడం, మౌలిక వసతులు కల్పించక పోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటిని సీజ్‌ చేశారు. ఈ ఆసుపత్రుల్లో కొన్ని ఆర్‌ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వారికి అర్హత లేకున్నా శస్త్రచికిత్సలు చేయడంపై జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని.. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా శస్త్రచికిత్సలు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా హెచ్చరించారు.

నిబంధనలు పాటించని ఆస్పత్రులు 90%
ఆసుపత్రుల ప్రొటోకాల్‌ ప్రకారం ప్రతీ శస్త్రచికిత్స వివరాలు ప్రభుత్వానికి నివేదించాలి. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే దానికి గల కారణాలను వివరించాలి. కానీ 90 శాతానికి పైగా ఆసుపత్రులు ఆ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు తీవ్ర యాంటీ బయాటిక్స్‌ మాత్రలు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎందుకు రాయాల్సి వచ్చిందో నివేదించాలి. ఆ మేరకు ఆసుపత్రికి ఒక కమిటీ ఉండాలి. ఇవేవీ ఆయా ఆసుపత్రులు పాటించడం లేదు. ఇక అనేక ఆసుపత్రుల్లో రోగులకు కనీస వసతులు ఉండటం లేదు. అవసరమున్నా లేకున్నా ప్రతీ దానికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులైతే వైద్య పరీక్షలు చేయించే విషయంలో డాక్టర్లకు టార్గెట్లు కూడా పెడుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు వైద్యాధికారులకు సమాచారం ఉంది.

మొత్తం ప్రసవాల్లో 58% సిజేరియన్లే
రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరిగితే.. అందులో 58 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లే. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 74 శాతం సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతోన్న కాన్పుల్లో 40 శాతం సిజేరి యన్‌ ద్వారా జరుగుతున్నాయి. సిజేరి యన్‌ కోసం రూ. 30 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎటువంటి శస్త్రచికిత్స, సిజేరియన్‌ అయినా కూడా నిబంధనల ప్రకారమే చేశారా? లేదా? అన్న వివరాలను తప్పనిసరిగా ప్రభు త్వానికి నివేదించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేయాలని.. నిబం ధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ఆసుపత్రులను సీజ్‌ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు విన్నవించినట్లు తెలిసింది.

అనవసర సిజేరియన్లు చేస్తే ఆసుపత్రుల సీజ్‌: లక్ష్మారెడ్డి
అనవసర సిజేరియన్లు చేసే ఆసుపత్రులను సీజ్‌ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక ఆసుపత్రిని సీజ్‌ చేశామన్నారు. ఆసుపత్రుల్లో చేసే ప్రతీ శస్త్రచికిత్స వివరాలను ప్రతి నెలా తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపాల్సిందేనన్నారు. ఏఎన్‌ఎంలకు ఆన్‌లైన్‌ ట్యాబ్‌ బేస్డ్‌ యాప్‌ అన్‌మోల్‌ను మంగళవారం సచివాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. శస్త్రచికిత్సల ప్రొటోకాల్‌ ఉంటుందని... ఆ వివరాల ద్వారా అనవసరమైన వాటిని గుర్తించొచ్చన్నారు. శస్త్రచికిత్సల వివరాలు పంపని ఆసుపత్రులపైనా చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో 4,900 మంది ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు ఇస్తామని, వారికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం నుంచి ఆరుగురు అధికారులను రాష్ట్రానికి నియమించామని తెలిపారు. కొందరు ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement