సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే మార్గదర్శకాలు విడుదల అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
డీఎంఈ ప్రతిపాదనల ప్రకారం బోధనాసుపత్రుల్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఆరేళ్ల సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించనుంది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేల్‌లో మార్పు తీసుకొస్తారు. తాజా ప్రతిపాదనలు బోధన వైద్యులకు ప్రయోజనం కల్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.
2,700 మందికి ప్రయోజనం...
ప్రస్తుతం బోధన వైద్యుల పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలా మందికి లభించడం లేదు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చిన పరిస్థితులున్నాయి. కొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. డీఎంఈ తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలగనుంది. అంతేకాక వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి స్కేల్స్‌ల్లోనూ మార్పులు చేయనున్నారు. అంటే ఆర్థికంగా కూడా వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇక ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి స్కేల్స్‌లో మార్పులు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment