సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు లభించనున్నాయి. అందుకు సంబంధించిన సీఏఎస్ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. తాజా నిర్ణయాల ప్రకారం బోధనాస్పత్రుల్లో నాలుగేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆటోమేటిక్‌గా పదోన్నతి లభించనుంది. అలాగే ఆరేళ్లు సర్వీసు పూర్తయిన అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. దీంతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పూర్తయిన వారి పే స్కేలులో మార్పు తీసుకొస్తారు.
ఎన్నేళ్ల ఎదురుచూపులో!
ప్రస్తుతం బోధనా వైద్యుల పదోన్నతులు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. రిటైర్ అయితేనే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే పదోన్నతులు లభిస్తుండగా చాలామందికి నిరాశే మిగులుతుంది. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వస్తుండటంతో వైద్యుల్లో నిరాశ నెలకొంది. కొందరికైతే 20 ఏళ్లకు కూడా పదోన్నతి కల్పించిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితి మార్చాలని వైద్యులు ఎన్నేళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. సీఏఎస్ అమలైతే రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 2,700 మంది వైద్యులకు ప్రయోజనం కలుగుతుంది. వారికి పదోన్నతి వచ్చిన ప్రతిసారి వేతనంలో మార్పులు చేస్తారు. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా నిర్ణీత సమయం ప్రకారం వారి వేతనంలో మార్పులు చేస్తారు.
ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం
సీఏఎస్ విధానానికి సీఎం ఆమోదం తెలపడంపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కేంద్ర విభాగం నేతలు డాక్టర్ నరహరి, డాక్టర్ ప్రవీణ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment