చెన్నమ్మ(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో శస్త్రచికిత్సకు సిద్ధం చేస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందింది. మత్తు మందు వికటించడం వల్లే చనిపోయిందంటూ విమర్శ లు వస్తుండగా.. ఆ సమయంలో గుండెపోటు రావడం వల్లే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గంట్లవెళ్ళి చెన్నమ్మ (68).. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న గ్రామంలో నిర్వహించిన శిబిరానికి కంటి పరీక్ష కోసం వచ్చారు. ఆమెకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించిన వైద్యులు.. రిఫరల్ ఆస్పత్రి పేరుతో చీటీ రాసిచ్చినట్లు తెలిసింది. ఆ చీటీతో శనివారం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రికి చెన్నమ్మ వెళ్లారు.
అక్కడ ఆపరేషన్‌కు ముందు ఆమెకు మత్తు మందు ఇవ్వగా అ తర్వాత కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. ఆరోగ్యంగా వెళ్లి శవమై తిరిగి వచ్చిందని, కంటి వెలుగు కోసమని వెళితే మా ఇంటి వెలుగు పోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యా రు. కాగా, ఆపరేషన్‌కు ముందే చెన్నమ్మకు కంటి చికిత్స కోసం మత్తు మందు ఇచ్చారని, చికిత్స కు ముందే ఆమె శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వెంటనే డాక్టర్లు షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పంపారని, దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలోనే గుండెపోటుతో చెన్నమ్మ మరణించినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కొద్దిపాటి మత్తుమందుతో ఎవరూ చనిపోవడం జరగదన్నారు. తమ తల్లికి ఆస్తమా ఉందని.. గతంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నట్లు కొడుకు సాయిలు తెలిపారు.
ముందే ఆపరేషన్‌కు..
కంటి వెలుగు కింద పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే రెండు వారాల తర్వాత చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. అయితే కొందరు పరీక్షలు చేయించుకున్న వెంటనే రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలూ అందుకు సుముఖత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఆపరేషన్ చేయడానికి ముందు వ్యక్తుల శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్) పరీక్షించాలి. అలా చేయనందునే మరణం సంభవించిందని ఆరోపణలున్నాయి. 50 ఏళ్ల తర్వాతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తుంటారు. కాబట్టి ఫిట్‌నెస్ తప్పనిసరిగా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment