ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు | IT, industries two eyes to development | Sakshi
Sakshi News home page

ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు

Published Wed, Jun 1 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు

ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు

- రెండేళ్లలో రూ.35 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు
- గతేడాది రూ.68,258 కోట్ల మేర ఐటీ ఎగుమతులు
- టీఎస్ ఐపాస్, ఐటీ పాలసీలతో పెట్టుబడులకు ఊపు
- ప్రాథమిక దశలోనే నిమ్జ్, ఫార్మాసిటీ ప్రతిపాదనలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పారదర్శకత, సరళమైన, అవినీతి రహిత విధానాలకు పెద్దపీట వేస్తూ... నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది. 2014 నవంబర్ 27న టీఎస్‌ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించగా 2015 జూన్ 12న సీఎం కేసీఆర్ నూతన పాలసీని ఆవిష్కరించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి ఎదురేగి స్వాగతం పలికి, పరిశ్రమల స్థాపనకు అనుమతులు, సౌకర్యాలు సమకూర్చేలా సీఎం కార్యాలయంలో ‘ఛేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు.

 భారీగా పెట్టుబడులు
 ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంగా ప్రభుత్వం చెబుతున్న టీఎస్ ఐపాస్ ద్వారా ఏడాది వ్యవధిలోనే రూ.35 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో 396, జిల్లా స్థాయిలో 1,623 పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... 1,20,169 మందికి కొత్తగా ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తోంది. టీఎస్‌ఐపాస్ ఆవిష్కరణ రోజే రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు ప్రకటించగా... తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. టీఎస్ ఐపాస్ ద్వారా మరో ఏడాదిలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు వీలుగా 1.45 లక్షల ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్‌ఐఐసీకి సర్కారు అప్పగించింది.

 మూతపడిన నిజాం షుగర్స్
 రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమ నిజాం దక్కన్ షుగర్స్‌ను నష్టాలు సాకుగా చూపుతూ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ మూసివేసింది. దీంతో సుమారు 350 మంది ఉద్యోగులతో పాటు వేల మంది రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మె గా టెక్స్‌టైల్ పార్కు, చేనేత విధానం రూపకల్పన ప్రాథమిక దశలోనే ఉండగా.. రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

 రెండేళ్లలో ముగ్గురు మంత్రులు
 రాష్ట్ర ఆవిర్భావం రోజున తొలి మంత్రివర్గంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా పరిశ్రమల శాఖ బాధ్యత చేపట్టారు. 2014 డిసెంబర్‌లో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జరిగిన మంత్రిత్వ శాఖల మార్పుల్లో కేటీఆర్‌కు పరిశ్రమల శాఖను అప్పగించారు.
 
 ఔత్సాహికులకు ప్రేరణ టీ-హబ్
 
వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ‘టీ-హబ్’ పేరిట 2015 నవంబర్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్ వర్సిటీ సహకారం అందిస్తున్న టీ-హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రేరణ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఫైబర్ గ్రిడ్, రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది.
 
 భూసేకరణ వివాదాల్లో నిమ్జ్
 రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం భారీ పారిశ్రామిక వాడల ఏర్పాటును ప్రతిపాదించింది. కొన్ని ప్రతిపాదనలకు భూసేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించగా... మరికొన్ని ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్కు స్థాపనకు కేంద్రం అనుమతివ్వగా ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధమైనా సీఎం వద్ద పరిశీలన దశలోనే ఆగిపోయాయి.

► మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 12 వేల ఎకరాల్లో నిమ్జ్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 3,700 ఎకరాలను మాత్రమే సేకరించారు. నిర్ణీత గడువులోగా భూమి సేకరిస్తేనే నిమ్జ్‌కు తుది అనుమతులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
► రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫార్మాసిటీ’ని 12,500 ఎకరాల్లో స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి డీపీఆర్ తయారీ ప్రాథమిక దశలోనే ఉండిపోయింది. భూసేకరణ కూడా నత్తనడకన సాగుతోంది. పరిహారం చెల్లింపు విషయంలో జహీరాబాద్, ముచ్చర్లలో రైతులు ఆందోళన బాట పట్టారు.
 
 ఐటీకి ప్రత్యేక పాలసీ

 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,300కుపైగా ఐటీ కంపెనీలుండగా.. ఐటీ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా గతే ఏడాది రూ.68,258 కోట్లు ఆర్జించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి జాతీయ దిగ్గజ కంపెనీలకూ హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించింది.

ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గ్రామీణ యువతను పట్టణ యువతతో సమానంగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నూతన ఐటీ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నోవేషన్, గేమింగ్-యానిమేషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ తదితర అనుబంధ పాలసీలూ తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు రాయితీలను ప్రకటించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రం నుంచి రూ.1.36 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో పాటు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement