సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు గ్రేటర్ సిటీకి జైకొడుతున్నాయి. మహా నగర శివారు ప్రాంతాలు ఈ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం టీఎస్ ఐపాస్, హార్డ్‌వేర్, ఐటీ పాలసీలను ప్రవేశపెట్టడంతో మూడేళ్లుగా ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలతోపాటు తయారీ, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో దిగ్గజ పరిశ్రమలు వందలాదిగా నగర శివార్లకు తరలివస్తున్నా యి. పరిశ్రమల శాఖ వర్గాల ప్రకారం.. గత 6 నెలల్లో నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు 255 దరఖాస్తులు అందాయి. వీటిలో 60 తయారీరంగం, 80 ప్లాస్టిక్, 40 ఏరోస్పేస్ విడిభాగాలు, 20 ఫార్మా కంపెనీలున్నాయి. ఐటీ సంబంధ కంపెనీలు 55 వరకు ఉన్నాయి. ఇవి శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. రెండేళ్లలో వీటి ద్వారా రూ.18,400 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
2015 నుంచి ఐటీ వెల్లువ..
నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రవాహానికి దారులు వేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్‌కు విశేష స్పందన లభిస్తోంది. 2015 నుంచి గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వివిధ రకాల కంపెనీల ఏర్పాటుకు దాదాపు 800 దరఖాస్తులు అందగా, 478 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుతో రూ.28,000 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీల్లో 3.29 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. రాబోయే రెండు మూడేళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
ఇబ్బడిముబ్బడిగా ఉపాధి..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ నగరంలో సుమారు వంద చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసరాలకే పరిమితమయ్యాయి. వీటి ద్వారా 50 వేల మందికి ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ కేంద్రంగా ఇప్పటికే బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల శాఖలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
అంతా అనుకూలమే..
టీఎస్ ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. విస్తరణలో భాగంగా ఇవన్నీ మరిన్ని బ్రాంచీలను ఏర్పాటు చేస్తాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో విశిష్ట భౌగోళిక వాతావరణ పరిస్థితులు, నైపుణ్యంగల ఐటీ నిపుణులు అందుబాటులో ఉండటంతో చాలా కంపెనీలు ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు మక్కువ చూపుతున్నాయి.
ఐటీ.. సిటీ మేటి
Published Tue, Mar 3 2020 1:55 AM | Last Updated on Tue, Mar 3 2020 1:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment