సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోన్న టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. నాలుగేళ్లుగా టీఎస్ ఐపాస్ అమలు తీరుపై సమీక్షించడంతోపాటు, అవసరమైన చోట సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత వస్తేనే మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తారని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత కాలంగా పరిశ్రమలకు భూ కేటాయింపులను కూడా పరిశ్రమల శాఖ నిలిపివేసింది. రాయితీలు, ప్రోత్సాహకాల చెల్లింపులో తదుపరి మార్గదర్శకాలు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను అనుసరించాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక చట్టం ‘టీఎస్ ఐపాస్–2014’ను రూపొందించింది. 2015 జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వెలువడే ఆదేశాల కొరకు పారిశ్రామికవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
పెరిగిన పారిశ్రామిక వృద్ధి రేటు..
రాష్ట్రంలోని వనరులను దృష్టిలో పెట్టుకుని 14 ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాలను రూపొందించారు. పెట్టుబడులతో వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘సింగిల్ విండో’విధానంలో ఆన్‌లైన్ ద్వారా 23 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 57 రకాల అనుమతులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘స్పెషల్ చేజింగ్ సెల్’ఏర్పాటు చేశారు. టీఎస్ ఐపాస్ అమల్లోకి వచ్చిన సుమారు నాలుగేళ్ల కాలంలో రూ.1.58 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, 15.28 లక్షల మంది ఉపాధి కల్పన జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు 20.8 శాతం కాగా 2015–18 మధ్య కాలంలో తెలంగాణ ఏకంగా 68.5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) అధ్యయన నివేదిక వెల్లడించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు చేరాయి.
పెట్టుబడులపై విశ్లేషణ..
టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందినవి ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ట్రేడ్, ఎలక్ట్రికల్ వెహికల్, సోలార్.. తదితర రంగాల్లో రూపొందించే ప్రత్యేక పాలసీలతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెట్టుబడులకు వీలున్న రంగాలపై ఎక్కువ దృష్టి సారిస్తూ, టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాల్లో ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత ఇచ్చేలా పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభిం చింది. నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతోపాటు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక పార్కుల ఏర్పాటు వంటి అంశాలకు టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు
టీఎస్ ఐపాస్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ–ప్రైడ్, ఇతరుల కోసం టీ–ఐడియా పేరిట పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ రెండు పారిశ్రామిక రాయితీ పథకాల్లో భాగంగా పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, అమ్మకం పన్నుపై రాయితీ, పావలా వడ్డీ తదితర ప్రోత్సాహకాలను ప్రకటించారు. టీఎస్ ఐపాస్ 2014 చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. టీప్రైడ్, టీ–ఐడియాకు సంబంధించి సుమారు రూ.2,200 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో టీ–ఐడియాకు సంబంధించి రూ.1,600 కోట్లు, టీ–ప్రైడ్‌కు సంబంధించి రూ.600 కోట్ల మేర రాయితీ బకాయిలు పేరుకుపోయాయి. నూతన మార్గదర్శకాల్లో రాయితీలు, ప్రోత్సాహకాల విడుదలపై స్పష్టమైన గడువు విధించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment