సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వివరించి, అవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఈడీబీ) భారీ ప్రచార ప్రణాళికను రూపొందించింది. వచ్చే 12 నెలల్లో రూ.18,300 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా వర్చువల్ సమావేశాలకే పరిమితమైన ఈడీబీ ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించనుంది. వివిధ దేశాల్లో జరిగే కీలకమైన 9 అంతర్జాతీయ సదస్సులు, దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే 41 సదస్సుల్లో పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించనుంది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు దుబాయ్ ఎక్స్‌పోలో రాష్ట్ర పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, ఇంధనం, గ్రామ వార్డు సచివాలయాలు వంటి కీలక శాఖల అధికారులు ఆ శాఖల్లోని పెట్టుబడి అవకాశాలను వివరించి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఈడీబీ అధికారులు తెలిపారు. జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా రాష్ట్రం భాగస్వామ్యం కానుంది. జాతీయ, అంతర్జాతీయ రోడ్‌షోలలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వాటిలో పాల్గొనే సంస్థలకు వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు.
అంతర్జాతీయ పెట్టుబడులపై దృష్టి
దుబాయ్ ఎక్స్‌పో, స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లకు వివరిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం ఈ రెండు సదస్సులకు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ఇంకా రాష్ట్ర అధికారుల బృందం పర్యటన ఖరారు కాలేదు. ఈ రెండు సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెవిలియన్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
– మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment