
సాక్షి, అమరావతి: దుబాయ్ ఎక్స్‌పో–2020లో ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడానికి అనేక సంస్థలు ఆసక్తిని కనబరిచాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ‘నవరత్నాలు’ పేరుతో రాష్ట్రంలో సాధిస్తున్న సుస్థిరమైన అభివృద్ధితో పాటు 11 రంగాలకు చెందిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధానంగా వివరించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో పెట్టుబడులకు రీజెన్సీ గ్రూపుతో ఒప్పందం జరిగిందన్నారు. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ (అలుబండ్ అనుబంధ సంస్థ), ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ మొబిలటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలిపాం
రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పో ద్వారా ప్రపంచానికి తెలియజేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. ఏపీ పెవిలియన్‌ను రోజుకు 7,000 నుంచి 10,000 మంది సందర్శించినట్లు ఏపీ ఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment