సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు ఏడాదికేడాది వృద్ధిలో సాగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి 195 దేశాలకు 2,106 రకాల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2019–20లో సుమారు రూ.1,08,348 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 2020–21లో 13.8 శాతం వృద్ధి రేటుతో రూ.1,23,370 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
ప్రస్తుతం దేశం ఎగుమతుల్లో 6 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2030 నాటికి 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచాలని నిర్దేశించుకుంది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ) లిమిటెడ్ ప్రస్తుత ఎగుమతుల పరిస్థితిపై చేసిన అధ్యయనం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతి చేసే ఉత్పత్తులకు కేటాయించే 8 సంఖ్యల హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ అధారంగా రాష్ట్రం నుంచి ఏయే దేశాలకు ఏయే ఉత్పత్తులు ఏ మేరకు ఎగుమతవుతున్నాయనేది స్పష్టమైంది.
మూడు స్థానాలు పెంచుకున్న రాష్ట్రం
2019–20లో దేశీయ ఎగుమతుల్లో ఏడవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం.. ఎగుమతులను ప్రోత్సహించడంతో 2020–21లో నాలుగో స్థానానికి చేరుకుంది. మొత్తం దేశ ఎగుమతుల్లో 21 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 20 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 9 శాతంతో తమిళనాడు, 6 శాతంతో ఆంధ్రప్రదేశ్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో డ్రగ్ ఫార్ములేషన్స్, స్టీల్–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ ఉపకరణాలు వంటి రంగాలు కీలకపాత్ర పోషించాయి.
విలువపరంగా 6 రంగాల నుంచే 60 శాతం ఎగుమతులు
రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 60 శాతం ఆరు రంగాల నుంచే వస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విలువ పరంగా చూస్తే రాష్ట్రం నుంచి అత్యధిక ఎగుమతుల్లో వనామీ రొయ్యలు అగ్రస్థానంలో ఉన్నాయి. గతేడాది రూ.8,760 కోట్ల విలువైన వనామీ రొయ్యలు రాష్ట్రం నుంచి ఎగుమతయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఓడలు, బోట్లు, టగ్స్ ద్వారా రూ.7,300 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,110 కోట్ల విలువైన జనరిక్ ఔషధాలు, రూ.4,380 కోట్ల విలువైన మాంగనీస్, రూ.3,650 కోట్ల విలువైన రసాయనాలు, రూ.2,920 కోట్ల విలువైన బియ్యపు నూక ఎగుమతి అయ్యాయి.
పరిమాణపరంగా 5 కీలక రంగాల నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రం నుంచి 216 లక్షల కిలోల గ్రానైట్, బెరైటీస్, సిమెంట్ ఎగుమతులు జరిగాయి. 133 లక్షల కిలోల ఇనుము/ఉక్కు, 115 లక్షల కిలోల బియ్యం, 44 లక్షల కిలోల ముడి ఇనుము, మాంగనీస్, 44 లక్షల కిలోల కాల్షియనేటెడ్ కోక్, హైగ్రేడ్ డీజిల్ ఎగుమతులు జరిగాయి.
లాటిన్ అమెరికాపై ఆసక్తి
మన రాష్ట్రం నుంచి వ్యాపారులు అత్యధికంగా ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తం ఎగుమతుల్లో 29 శాతం వాటాతో ఉత్తర అమెరికా అగ్రస్థానంలో ఉంది. గతేడాది ఉత్తర అమెరికాకు రూ.17,388.6 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఆ తర్వాత స్థానంలో ఆసియా దేశాలున్నాయి. ఎగుమతుల్లో 21 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్న ఆసియా దేశాలకు గతేడాది రూ.12,884.5 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. యూరోపియన్ దేశాలకు రూ.6,073.6 కోట్లు, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు రూ.3,212 కోట్ల విలువైన ఎగుమతులు చేశారు.
బ్లూ ఎకానమీపై దృష్టి
సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై అధికంగా దృష్టి సారిస్తున్నాం. ఎగుమతులు పెరిగితే ఆ మేరకు ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10% వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు ఎయిర్ కార్గో అవకాశాలను పెంచుతున్నాం.
– మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి
జిల్లాల వారీగా ఉత్పత్తుల ఎంపిక
రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలు ఉన్న ఉత్పత్తులను జిల్లాల వారీగా ఎంపిక చేసి వాటిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాం. వివిధ దేశాల్లో ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అమ్మకం, కొనుగోలుదారులతో సమావేశాలను నిర్వహిస్తున్నాం.
– జి.రాజేంద్రప్రసాద్, వీసీఎండీ, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment