సాక్షి, అమరావతి: దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను ప్రస్తుతం ఉన్న 5.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ.1,07,730 కోట్లకుపైగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల్ని 2030 నాటికి రూ.2,52,750 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధన కోసం రంగాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎగుమతుల్లో కీలకమైన నాలుగు రంగాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఇతరత్రా మార్కెట్ అవకాశాలు, అమ్మకాలు, సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టిసారించింది. మత్స్యసంపద, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ముడి ఇనుము–స్టీల్ ఎగుమతుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ కాఫీ, గ్రానైట్, బైరటీస్, నిర్మాణరంగ పరికరాలు, ఎలక్ట్రికల్, కాటన్, దుస్తులు వంటి మరికొన్ని రంగాల్లో వ్యాపార అవకాశాలను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. అగ్రస్థానంలో ఉన్న 4 రంగాల ఎగుమతుల వాటా 2030 నాటికి 42.7 శాతానికి చేర్చాలని నిర్ణయించింది. దేశ ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటాను 10%కి పెంచేందుకు కొన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.
ఇదీ రోడ్‌మ్యాప్
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.16,350 కోట్లుగా ఉన్న చేపలు, రొయ్యల ఎగుమతి 2030 నాటికి రూ.37,575 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు పెద్దపీట వేయడమే కాకుండా కాకినాడ వద్ద బల్‌్కడ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటివల్ల ఫార్మా ఎగుమతులు ప్రస్తుతం ఉన్న రూ.12,300 కోట్ల నుంచి రూ.28,275 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తోంది.
వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారంతోపాటు రాష్ట్రంలో పోస్కో, జిందాల్ వంటి సంస్థలు ఉక్కు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రంగంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు, విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ముడి ఇనుము, ఉక్కు ఎగుమతుల విలువ రూ.7, 425 కోట్ల నుంచి రూ.17,100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రసాయనాల ఎగుమతులు రూ.10,725 కోట్ల నుంచి రూ.24,675 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మినరల్ ఫ్యూయల్స్ రూ.3,300 కోట్ల నుంచి రూ.7,650 కోట్లకు, కాఫీ ఎగుమతులు రూ.3,900 కోట్ల నుంచి రూ.8,625 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎగుమతులను భారీగా పెంచుదాం
Published Fri, Jun 11 2021 4:18 AM | Last Updated on Fri, Jun 11 2021 4:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment