పొరుగు రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా ఏపీ మెరుగు | Industrially better AP than neighboring states | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాల కన్నా పారిశ్రామికంగా ఏపీ మెరుగు

Published Mon, Mar 8 2021 4:18 AM | Last Updated on Mon, Mar 8 2021 4:18 AM

Industrially better AP than neighboring states - Sakshi

సాక్షి, అమరావతి: వెళ్లిపోతున్నాయ్‌.. తరలి వెళ్తున్నాయ్‌...! అంటూ రాష్ట్రంలోని పరిశ్రమలపై దుష్ప్రచారం చేసిన ప్రతీసారి నిజమేంటో, ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూనే ఉన్నారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, ఛానళ్లలో అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు వెలువరిస్తుండటం పట్ల మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. ఆ వివరాలివీ..

కియా మరిన్ని పెట్టుబడులు...
కియా కార్ల పరిశ్రమ వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చాక ఏకంగా రూ.400 కోట్లతో మరింత విస్తరిస్తామని కియా ప్రకటించింది. ’మన పాలన  మీ సూచన’ కార్యక్రమం సందర్భంగా మే 28న పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన మేధోమథన సదస్సులో కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈవో కూక్‌ హ్యూన్‌ షిమ్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అదానీ డేటా సెంటర్‌ వెళ్లిపోతోందనే అసత్య ప్రచారానికి తెరతీశారు. కానీ అదానీ గ్రూప్‌ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెడతామని, దాదాపు 25 వేల మందికి ఉపాధి అందించనున్నట్లు ఆ సంస్థే వెల్లడించింది. డేటా సెంటర్‌ మాత్రమే కాదు ఐటీ పార్కు, కన్వెన్షన్‌ సెంటర్‌ లాంటివి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరంలో వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ నుంచి రూ.1,954 కోట్లతో పోర్టులో 31.5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూప్‌ స్వయంగా ప్రకటన చేసింది. అదానీ గ్రూప్‌ గత ఏడాది ఏపీలో మరో పోర్ట్‌ కృష్ణపట్నాన్ని రూ.12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. అశోక్‌ లేలాండ్‌ కూడా ఉత్పత్తి ఆపేసిందని ఊదరగొట్టారు. విజయవాడలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కు సమీపంలో నెలకొల్పిన ఈ ప్లాంటు కరోనా సమయంలో కూడా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించింది. తాజాగా ఉత్పత్తీ ప్రారంభించింది. 

ముందంజలో ఏపీ
గత రెండేళ్లలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కన్నా పెట్టుబడులు, స్థాపన, ఉత్పత్తి ప్రారంభించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రతి నెలా విడుదల చేసే గణాంకాలే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన ప్రతిపాదనలు 2019లో రూ.18,823 కోట్ల వరకు ఉండగా తమిళనాడు, తెలంగాణ గణాంకాలు పరిశీలిస్తే వరుసగా రూ.8,562 కోట్లు, రూ.5,432 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ఆ రాష్ట్రాలకు వచ్చాయి. 2020లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రతిపాదనలు రూ.9,727 కోట్లు కాగా తమిళనాడులో రూ.6,807 కోట్లు, తెలంగాణలో రూ.7,392 కోట్లు ఉన్నాయి.

కష్టకాలంలో పరిశ్రమలకు అండగా ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సమయంలోనూ ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల వివరాలు పరిశీలిస్తే 2020లో రూ.9,840 కోట్ల పెట్టుబడులున్నాయి. అదే తెలంగాణలో రూ.6,057 కోట్లు, తమిళనాడులో కేవలం రూ.1,184 కోట్లు మాత్రమే ఉన్నాయి. 2019లో ఏపీలో పరిశ్రమలు రూ.34,696 కోట్ల విలువైన ఉత్పత్తిని ప్రారంభించాయి. తమిళనాడులో రూ.2,860 కోట్లు, తెలంగాణలో రూ.7,364 కోట్ల విలువైన ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ వివరాలన్నీ గత సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు వరకూ డీపీఐఐటీ, ఐఈఎమ్‌లలో అధికారికంగా పొందుపరిచారు. కరోనా సమయంలో పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచిన తీరును యావత్‌ దేశం ప్రశంసించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక సంస్కరణలను చూసి పొరుగు రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందుతున్నాయనడంలో సందేహం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement