సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఔత్సాహికులను గుర్తించే పనిని రాష్ట్ర పరిశ్రమల శాఖ చేపట్టింది. ఇందుకోసం ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 2, 3 మండలాలకు కలిపి రెండుసార్లు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 320 సదస్సులు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. వ్యాపార రంగంలోకి దిగాలనుకునే 100 మంది ఔత్సాహికులను గుర్తించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలపై వారికి అవగాహన కలి్పస్తామని వివరించారు. ఇలా వచ్చిన వారిలో మండలానికి కనీసం ఒక ఐదు మందిని ఎంపిక చేసి.. ఇన్వెస్ట్‌మెంట్ మోటివేషన్ క్యాంపెయిన్(ఐఎంసీ) పేరుతో మూడు రోజుల పాటు పెట్టుబడి వ్యయం, ఫైనాన్సింగ్, భూమి కొనుగోళ్ల తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందజేస్తామని వెల్లడించారు.
అవకాశాలు మెండు..
రాష్ట్రంలో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్, బొమ్మలు, ఫర్నీచర్, రసాయనాలు వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక భారీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పెద్ద సంస్థల ద్వారా అనేక ఎంఎస్‌ఎంఈలకు అవకాశాలేర్పడుతాయి. అలాగే ఒక జిల్లా–ఒక ఉత్పత్తి పేరిట కేంద్రం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి ద్వారా కూడా స్థానిక ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే అవకాశాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించనున్నారు. అలాగే పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి సొంతంగా యూనిట్లు పెట్టుకునే వారిని గుర్తించి.. వారికి కూడా అవగాహన సదస్సులు నిర్వహించేలా పరిశ్రమల శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది.
రెండేళ్లలో 3,000 మంది పారిశ్రామికవేత్తలు..
కొత్త ఆర్ధిక సంవత్సరం రాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మూడు నెలల్లో సదస్సులు పూర్తి చేసి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వీరికి శిక్షణ పూర్తి చేసి ఏపీఐఐసీ, బ్యాంకుల నుంచి రుణాలిప్పించి రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభింపజేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విధంగా కనీసం 3,000 మంది కొత్త పారిశ్రామికవేత్తలను పరిచయం చేసినట్లవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment