
ఆరంభం అదిరింది
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ ఆరంభం అదిరింది. అనుమతులను గడువు కంటే ముందే జారీ చేశారు. ప్రభుత్వం ఈ నెల 12న ప్రకటించిన నూతన పారిశ్రామికవిధానం మరో అడుగు ముందుకేసింది. దీంతో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తొలి రెండు వారాల్లోనే రాష్ట్రానికి రూ. 1,500 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లయింది. 17 కంపెనీలకు గడువు కంటే ముందుగానే అనుమతుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మొదటి విడత అనుమతులు పొందిన కంపెనీలకు స్వయంగా సీఎం కేసీఆర్ మంగళవారం సెక్రటేరియట్‌లో అనుమతిపత్రాలు అందజేయనున్నారు.
ఈ పరిశ్రమల ఏర్పాటుతో 4 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తొలివిడత అనుమతి పొందే వాటిలో ఐటీసీతోపాటు పలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో పేరొందిన కంపెనీలను ప్రభుత్వం రాష్ట్రానికి ఆహ్వానించింది.
కొత్త విధానం ప్రకారం రెండు వారాల్లోగా అర్జీదారులకు అనుమతులు జారీ చేయాలి. కానీ అధికారులు వేగంగా పనిచేసి నిర్దేశించిన గడువు కంటే ముందుగానే ఈ అనుమతుల జారీ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. స్వయంగా సీఎం పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఛేజింగ్ సెల్ సారధ్యంలో పది రోజుల్లోనే అనుమతులు మంజూరు కావటం గమనార్హం.