విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది.
జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్
విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.
కొత్త కోర్సులకు రూపకల్పన
ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
తొలిదశలో నాలుగుచోట్ల
ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది.
84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్‌టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది.
కొత్త కోర్సులు అవసరం
ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు
పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా
క్యాంపస్ కొలువు కొట్టా
మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment