కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు | telangana cabinet approval to new secretariat | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ బాట

Published Thu, Aug 6 2020 2:43 AM | Last Updated on Thu, Aug 6 2020 7:33 AM

telangana cabinet approval to new secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది.

బాధితులకు హోం ఐసోలేషన్‌ కిట్లు 
కరోనా వ్యాప్తి – వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స– ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. ‘కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని వైద్య నిపుణులు కేబినెట్‌ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్‌ ఉద్ఘాటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్‌ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేసింది. 
– రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, డెక్సామితజోన్‌ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్‌ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కోవిడ్‌ చికిత్సపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి.
– పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ ఇవ్వాలి. 10 లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ సిద్ధంగా ఉంచాలి.
– రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధంగా ఉంచాలి.
– ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం. 
– కోవిడ్‌ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి.
– ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి. 
–ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. 
–  ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.


త్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్‌ అభినందించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. 

వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ 
లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్‌ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్నవారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

టీఎస్‌–బీపాస్‌కు ఆమోదం
భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్‌–బీపాస్‌ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్‌–ఐపాస్‌ లాగానే టీఎస్‌–బీపాస్‌ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్‌ అభిప్రాయపడింది. 

స్థానిక సంస్థలకు వన్‌టైం సెటిల్మెంట్‌ అవకాశం
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్‌ బిల్లుల బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది
ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
– కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది.
–దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది. 
– రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement