కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర
- రాజీవ్‌శర్మ నుంచి బాధ్యతల స్వీకరణ
- 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
- టీఎస్ ఐపాస్ రూపకల్పనలో కీలక పాత్ర
- ఇప్పటిదాకా 22 రకాల పోస్టుల్లో విధులు
- అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధి కారి. రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి కావటం, వివిధ శాఖల్లో పని చేసిన అనుభవమున్న అధికారి కావటంతో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకు న్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. మరో నెలరోజులు మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీవ్ శర్మ తర్వాత సీనియర్ కావడంతో ప్రదీప్‌చం ద్రకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణరుుం చారు.
బుధవారం సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేసిన వెంటనే ప్రదీప్ చంద్ర కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సచివా లయం సమత బ్లాక్‌లోని సీఎస్ చాంబర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బాధ్యతలు స్వీక రించారు. రిటైరవుతున్న సీఎస్ రాజీవ్‌శర్మ తన పదవీ బాధ్యతలను కొత్త సీఎస్‌కు అప్పగించారు. ప్రదీప్‌చంద్రకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
తెలుగువాడు..
ప్రదీప్ చంద్ర గుంటూరు జిల్లాకు చెందినవారు. 1956 డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. కలకత్తాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. గతంలో గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. సబ్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించిన ఆయన.. 22 రకాల పోస్టుల్లో విధులు నిర్వహించారు.