నాన్నే నాకు ఆదర్శం
⇒ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర
⇒ సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా అన్నారు
⇒ అప్పుడే రూట్ మార్చుకున్నా.. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యా
⇒ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా..! నువ్వే ఆలోచించుకో.. ప్రజలకు సాయం చేయటంలో ఉన్నంత సంతృప్తి ఎందులో లేదు. ఉన్నత చదువు చదివితే సరిపోదు. అది ప్రజలకు ఉపయోగపడాలి.. అని మా నాన్న చంద్రయ్య అన్న మాటలే ఇప్పటికీ నాకు స్ఫూర్తి. అప్పుడు నేను ముంబైలో హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తయ్యాక ఆ ఉద్యోగంలో చేరాను. నాన్నకు అది నచ్చలేదు. అంతకంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం చేయాలని వెన్నుతట్టాడు. అప్పుడే రూట్ మార్చుకున్నాను.
సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లాను. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యాను’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్ర చెప్పారు. ‘‘గతంలో మా నాన్న చంద్రయ్య ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. చిన్నతనంలో తన వెంట తీసుకెళ్లేవాడు. మార్కాపురం చుట్టు పక్కల ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలు అప్పుడే పరిచయం. గ్రామీణ ప్రజల కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూశాను’’అని ఆయన తన మనోగతాన్ని గుర్తు చేసుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రదీప్ చంద్ర మీడియాతో మాట్లాడారు. నాన్న స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజా సంక్షేమం లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు.
‘‘ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు పని చేస్తా. ఆయన ఆశయాలు సాధించటమే బాధ్యత గల అధికారులుగా మా అందరి ముందున్న లక్ష్యం. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పరిపాలనా ఫలాలు అందించే లక్ష్యానికి చేరువయ్యాం. జిల్లాల పరిధి తగ్గినందున జనాభా తగ్గింది. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత ఆస్కారం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ చేరేలా కార్యాచరణ చేసుకుంటాం’’అని వివరించారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తాం
రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి అపరిష్కృత సమస్యలు ఇంకా ఉన్నాయని ప్రదీప్ చంద్ర చెప్పారు. తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ సంపూర్ణం కాలేదని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధానానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. జటిలమైన సమస్య. ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుంటాం.
చిన్న నోట్లు అందుబాటులో లేకపోవటంతో పట్టణాల్లో కంటే పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నఫళంగా క్యాష్‌లెస్ విధానం అక్కడ అమల్లోకి తీసుకురావటం కూడా కష్టమే. అక్కడ నగదు నోట్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటా నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తాం. మార్కెట్ కమిటీలు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో ఈ వాలెట్ పద్ధతి ప్రవేశపెడతాం’’ అని సీఎస్ చెప్పారు.