ఆదిబట్లలోని ఏరో స్పేస్
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం..
సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి.
రూ.వేల కోట్ల పెట్టుబడులు
జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్‌ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్‌లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్‌లు, పార్క్‌లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది.
పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ..
- జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం
- నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం
- టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం
- కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం
- రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం
ఇన్‌చార్జి కలెక్టర్ హర్షం
టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment